బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై ప్రముఖ దర్శకుడు క్రిష్ మండిపడ్డారు. మణికర్ణిక సినిమాను క్రిష్ 30 శాతం మాత్రమే షూటింగ్ చేసినట్లు కంగనా చెప్పడంతో ఆయన మండిపడ్డారు. నిజానికి తాను ఉన్నప్పుడే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయిపోయిందని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిష్ మాట్లాడుతూ... కంగనా చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నించిందని చెప్పుకొచ్చారు. అర్హత లేకున్నా సినిమాలో ఆమె దర్శకత్వంపై మొత్తం క్రెడిట్ తీసుకుందనీ, ఆమెకు ఎలా నిద్రపడుతుందో నాకు అర్థం కావట్టేదంటు చెప్పుకొచ్చారు.

గత యేడాది జూన్ లోనే దాదాపుగా సినిమా పూర్తయిపోయిందని క్రిష్ తెలిపారు. అయితే కంగనా ఫస్టాఫ్ లో 20-25 శాతం, సెకండాఫ్ లో 10-15 శాతం సన్నివేశాలను రీషూట్ చేసిందన్నారు. కంగనా ‘మణికర్ణిక’ సినిమాలో చాలా మార్పులు సూచించారనీ, అందుకు తాను అంగీకరించానని అన్నారు. అయితే చివరికి ఈ సినిమాలో సోనూసూద్ నటిస్తున్న సదాశివరావ్ పాత్రను ఇంటర్వెల్ కు ముందుగానే చంపేయాల్సిందిగా కంగన కోరిందన్నారు. ఇది చరిత్రను వక్రీకరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశాను. వాస్తవానికి యుద్ధరంగంలో లక్ష్మీబాయి కంటే కొద్దిసేపటి ముందే సదాశివరావ్ మరణిస్తాడన్నారు.

ఈ విషయంలో తనకు, కంగనకు మధ్య వాగ్వాదం కాగా, నిర్మాత కమల్ ఆమె వైపే నిలబడ్డారని విమర్శించారు. సోనూసూద్ పాత్రను చంపేందుకు తాను అంగీకరించకపోవడంతో కంగనా మరొకరి సాయంతో సినిమాకు దర్శకత్వం వహిస్తుందని నిర్మాత కమల్ జైన్ చెప్పారన్నారు. తాను లేకుంటే సినిమాలో ఉండబోనని నటుడు సోనూ సూద్ స్పష్టం చేయడంతో మరో నటుడితో ఈ పాత్రను షూట్ చేశారన్నారు.