కరోనా విజృంభన చిత్రపరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికే కరోనా కారణంగా సినిమా విడుదలలు వాయిదా వేసుకుంటున్నారు. తాజాగా సినిమా షూటింగ్‌లు కూడా వాయిదా పడుతున్నాయి. సినిమా షూటింగ్‌లో కొందరు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో వాటిని వాయిదా వేసుకోడమే బెస్ట్ అని భావిస్తున్నారు. తాజాగా రవితేజ సైతం తన సినిమా షూటింగ్‌ని వాయిదా వేసుకున్నారు. ఆయన ఇటీవల ఓ కొత్త సినిమాని ప్రారంభించారు. శరత్‌ మండవని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా చేయబోతున్నారు రవితేజ. 

మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. సోమవారం నుంచి ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. హైదరాబాద్‌లోనే మొదటి షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారు. కానీ కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో దాన్ని క్యాన్సిల్‌ చేశారు. కొన్ని రోజుల తర్వాత కాస్త కరోనా తగ్గుముఖం పట్టాక షూటింగ్‌ జరపాలని భావిస్తున్నారట. ఈ సినిమాని హైదరాబాద్‌తోపాటు హార్స్ లీ హిల్స్, చిత్తూరు, కర్నాటక వంటి ప్రాంతాల్లో దాదాపు 90 రోజులపాటు చిత్రీకరించనున్నారు. ఇందులో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని, అందులో ఒకరు `మజిలీ` ఫేమ్‌ దివ్యాంశ కౌశిక్‌ని ఎంపిక చేసినట్టు టాక్‌. దీన్ని సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం మాస్‌ మహారాజా రవితేజ రమేష్‌ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` సినిమా చేస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంది. ఇది మే 28న విడుదల కావాల్సి ఉంది. కానీ రిలీజ్‌ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉంది.