రవితేజ నటించిన `క్రాక్‌` సినిమా కథ, కథనం నాదే అంటూ ఓ రచయిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

మాస్‌ మహారాజా రవితేజ(Raviteja)కి చాలా రోజుల తర్వాత హిట్‌ ఇచ్చిన చిత్రం `క్రాక్‌`(Krack). వరుస పరాజయాల్లో ఉన్న ఆయనకు `క్రాక్‌` విజయం పూర్వ వైభవాన్ని, ఉత్సాహాన్నిచ్చింది. అభిమానుల్లో జోష్‌ నింపింది. ఈ చిత్రం తర్వాత రవితేజ వరుసగా నాలుగు సినిమాలకు కమిట్‌ కావడం విశేషం. ఆయన కమిట్‌ అయిన చిత్రాలు ఇంకా ఉన్నాయి. `క్రాక్‌` వచ్చి కూడా ఏడాది అయిపోయింది. ఆ తర్వాత రవితేజ నుంచి మరో సినిమా `ఖిలాడీ` కూడా వచ్చి పరాజయం చెందింది. 

కానీ `క్రాక్‌` చిత్ర కథ నాదే అంటూ ఓ రచయిత బయటకు రావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. `క్రాక్‌` సినిమాలోని సన్నివేశాలు, డైలాగ్‌లన్నీ తాను రాసుకున్న కథలోనివే అని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అల్వాల్‌కి చెందిన శివ సుబ్రమణ్యమూర్తి అనే వ్యక్తి 2015లో `బళ్లెం సినిమా మీడియా డైరెక్టరీ` పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. ఏడాదిన్నర క్రితం వచ్చిన రవితేజ హీరోగా వచ్చిన క్రాక్‌ సినిమాలో సన్నివేశాలు, కథ, కథనం మొత్తం తన పుస్తకంలో ఉన్నవేనని తెలిపారు. 

`క్రాక్‌` నిర్మాణ సంస్థతోపాటు, దర్శకుడు,హీరోలకు ఫిల్మ్ ఛాంబర్‌నుంచి నోటీసులు పంపించినా పట్టించుకోవడం లేదని సుబ్రమణ్య మూర్తి జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సినిమా నిర్మాత మధుసూదన్‌రెడ్డి జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్‌ నగర్‌లో నివాసం ఉంటున్న కారణంగా తాను అక్కడ ఫిర్యాదు చేసినట్టు రచయిత తెలిపారు. దీంతో `క్రాక్‌` చిత్రానికి కొత్త చిక్కులు మొదలయ్యాయని చెప్పొచ్చు. 

జనరల్‌గా యంగ్‌ రైటర్స్ కథలను దర్శకుడు కాపీ కొడుతున్నారనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. యంగ్‌ రైటర్స్ ని ఆహ్వానిస్తూ, వారి వద్ద కథలు వింటూ, వాటిని రిజక్ట్ చేశాక, వాటిని కాపీ కొడుతున్నారనే విమర్శలు వచ్చాయి. పెద్ద సినిమాల కథల విషయంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. రైటర్స్ కి ఎలాంటి క్రెడిట్‌ ఇవ్వకుండా కాపీ కొడుతున్నారని, యదావిధిగా ఆయా కథలతోనే సినిమాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు `క్రాక్‌` సినిమా విషయం వివాదంగా మారడం వాటికి బలాన్నిస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తేలాల్సి ఉంది.