ఇప్పుడు రియల్‌ హీరో పేరు చెబితే.. సోనూ సూద్‌ పేరే వినిపిస్తుంది. అవును.. ఆయన లాక్‌ డౌన్‌ టైమ్‌లో, అంటే చాలా క్లిష్ట సమయంలో తనవంతుగా కొన్ని వేల మందికి సహాయం చేశారు. కడుపునిండా భోజనం పెట్టాడు. వలస కార్మికులను సురక్షితంగా తన సొంతూళ్లకి పంపించాడు. ఆ తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నాడు. గూడు లేని వారికి గూడు ఇస్తున్నాడు. అందుకే ఈయన సినిమాల్లో విలన్‌ అయినా, రియల్‌ లైఫ్‌లో హీరో అయ్యాడు. 

సోనూ సూద్‌ని `ఆచార్య` టీమ్‌ సత్కరించింది. ఆయన మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్‌లో పాల్గొన్న ఆయనకు చిత్ర బృందం చిరు సత్కారాన్ని అందించింది. సెట్‌లోనే శాలువాతో తనికెళ్ల భరణి, దర్శకుడు కొరటాల శివ సత్కరించారు. ఆయన సేవా కార్యక్రమాలను పొగిడారు. క్లిష్ట సమయంలో పేదలను, కార్మికులను ఆదుకుని తన గొప్ప మనసుని చాటుకున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియో విశేషంగా ఆకట్టుకుంటుంది.