టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన కాజల్ అగర్వాల్ కెరీర్ ఇప్పుడు అంత సాఫీగా సాగడం లేదు. ఈ ఏడాదిలో ఆమె నటించిన 'సీత', 'రణరంగం' సినిమాలు విడుదలయ్యాయి. 'సీత' ఆశించిన సక్సెస్ ని అందుకోలేకపోయింది. 'రణరంగం'లో కాజల్ పాత్రకి ఎలాంటి ప్రాముఖ్యత లేదు.

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. సినిమాలో కళ్యాణి  ప్రియదర్శిని బాగా హైలైట్ అయింది. ఆమె ముందు కాజల్ తేలిపోయింది. టాలీవుడ్ లో ఈ భామకి సక్సెస్ రాకపోయినా.. కోలీవుడ్ లో మాత్రం మంచి హిట్ పడింది. జయం రవి సరసన ఆమె 'కోమాలి' అనే సినిమాలో నటించింది కాజల్. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ ని దక్కించుకుంది.

ఒక కుర్రాడు టీనేజీలో అనుకోకుండా  ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్తాడు. పదహారేళ్ల తరువాత దాని నుండి బయటపడి ఈ ప్రపంచంలోకి వస్తాడు. అప్పుడు అతడికి ఎదురయ్యే అనుభవాల నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ విడుదలైన రోజే మంచి అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు సినిమాకి కూడా మంచి హిట్ టాక్ లభించింది.

జయం రవి కెరీర్ లో 'తని ఒరువన్' లాంటి భారీ హిట్ సినిమా ఉన్నప్పటికీ 'కోమాలి' తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతుందని చెబుతున్నారు. ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ రోల్ గ్లామర్ క్యారెక్టర్ అయినప్పటికీ సినిమా సక్సెస్ కావడంతో ఆమెకి కూడా పేరొచ్చింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.