చిత్ర పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ యువ కమెడియన్ అకాల మరణం పొందారు. దీనితో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కోలీవుడ్ కి చెందిన తేపట్టి గణేశన్ అనారోగ్యం కారణంగా నేడు తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా గణేశన్ ఆరోగ్యం సరిగా లేదని తెలుస్తుండగా.. మధురైలోని  ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనను అడ్మిట్ చేయడం జరిగింది. 
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న గణేశన్ గుండెపోటుకు గురికావడంతో తుదిశ్వాస విడిచాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

 గణేశన్ కొన్నాళ్లుగా మానసిక వేదనతో బాధపడుతున్నట్లు సమాచారం. లాక్ డౌన్ కారణంగా ఆయనకు సినిమా అవకాశాలు లేకుండా పోయాయి. ఆఫర్స్ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఆయనను చుట్టుముట్టాయట. కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసి గణేశన్ నష్టపోయినట్లు సమాచారం. తన కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని గతంలో సోషల్ మీడియా సందేశం పంపారు గణేశన్. 

గణేశన్ మృతి వార్త తెలుసుకున్న దర్శకుడు శ్రీను రామస్వామి సోషల్ మీడియా ట్వీట్ చేయడంతో పాటు, దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బిల్లా 2, ఉస్తాద్ హోటల్, నీరపరై, కన్నే కలైమనే చిత్రాలలో గణేశన్ నటించడం జరిగింది. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.