సౌత్‌లో విభిన్న చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా స్వస్థలం కేరళ ఉంటున్న ఈ బ్యూటిని కిడ్నాప్‌ చేసేందుకు ఓ ముఠా ప్రయత్నించింది. కొద్ది రోజులుగా నటి పూర్ణకు సోషల్  మీడియా వేదికగా వేదింపులు వస్తున్నాయి. ఇటీవల వేదింపులు తీవ్రమవ్వటంతో పాటు డబ్బు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

కొచ్చి సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్‌ ఇవ్వటంతో వెంటనే స్పందించిన పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్తాయిలో విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి. ఆ వివరాలను కొచ్చి పోలీస్‌ కమీషనర్‌ విజయ్‌ సఖారే వెల్లడించారు. పూర్ణను 12 మంది సభ్యులున్న ముఠా కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిందని వారిలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు.

వీరంతా గత మార్చి నెల పాలక్కాడ్‌లో ఎనిమిది మంది మోడల్స్‌ను కిడ్నాప్‌ చేసి డబ్బులు వసూళు చేసిన ముఠాలోని కీలక సభ్యులే అని తెలిపారు. అయితే వారు పూర్ణ కిడ్నాప్‌కు ఎలా స్కెచ్‌ వేశారో కూడా వివరించాడు పోలీసు అధికారులు. ప్రస్తుతం పూర్ణకు సంబంధాలు చూస్తుండటంతో పెళ్లి పనుల్లో భాగంగా వాళ్లతో సంబంధాలు కలుపుకొని కిడ్నాప్ చేసి ఓ హోటల్‌ రూంలో బంధించాలని స్కెచ్‌ వేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.

ముందుగా లక్షన్నర ఇవ్వాలని బెదిరింపులకు దిగిన దుండగులు ఆ ప్లాన్ విఫలం కావటంతో కిడ్నాప్ చేయాలని డిసైడ్‌ అయ్యారని తెలిపారు. గతంలోనూ ప్రొడ్యూసర్లం అని చెప్పి చాలా మంది మోడల్స్, నటీనటులను వివరాలు సేకరించి వారిని బెదిరించి డబ్బులు వసూళు చేశారని పోలీసులు గుర్తించారు. పూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ మూఠాపై 7 కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. ముందుగా ఈ కేసులో సినీ ప్రముఖుల ప్రమేయం కూడా ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చినా, అలాంటిదేమి లేదని చెప్పారు పోలీసులు.