సంపూర్ణేష్‌ బాబు  నటించిన ‘కొబ్బరి మట్ట’ సినిమా విడుదల సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు.  విభిన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్‌ బాబు ఈ సినిమా విడుదల కోసం దాదాపు రెండు సంవత్సరాలుకు పైగా నిరీక్షిస్తున్నారు. 2016 లోనే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అప్పటి నుండి కొన్ని కారణాల వలన సినిమా విడుదలకు నోచుకోలేదు. తాజాగా చిత్రం విడుదలకు సిద్దంగా ఉండటంతో...‘కొబ్బరిమట్ట’ సినిమాలోని పెద్ద డైలాగ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. 

‘ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారిగా 3.30 నిమిషాల సింగల్ షాట్ డైలాగ్ ఉన్న సినిమా ‘కొబ్బరిమట్ట’’ అంటూ ఈ వీడియో గురించి సంపూ చెప్పారు.

‘ఏరా పెద రాయుడు.. ఓరీ ఓరోరీ ఆపరా..’ అంటూ మొదలైన సంపూ డైలాగ్‌.. ‘పెదరాయుడు టైమ్‌ ఈజ్‌ వోవర్‌.. ఆండ్రాయుడు టైమ్‌ స్టార్ట్స్‌ నౌ..’ అంటూ 3.30 నిమిషాలపాటు  సాగింది. ‘ డైలాగ్‌ అద్భుతంగా చెప్పావ్‌..’ అంటూ ఈ ట్రైలర్‌కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

‘ప్రతి బ్యాచులర్‌ కొంపలో… మందు సిట్టింగ్‌కు బెస్ట్ స్టఫ్ ‘కొబ్బరిమట్ట’ అవబోతోంది. ఒక కొత్త రకమైన, అదేదో రకమైన సినిమాని చూసి మీరు నవ్వుకోబోతున్నారు. మీ అందరి ప్రేమ, ఆదరణ మాకు కావాలి. మీరు షేర్లు, లైకులు చేస్తారు, ఎందుకంటే నిజానికి మీరు మంచోళ్లు. చివరికి మేం సిద్ధమయ్యాం. ఏడాదిన్నర కష్టం. కష్టం అనేది చిన్న మాట. ఈ సినిమాను నిర్మించినందుకు గర్వపడుతున్నా. ఎలాంటి వినూత్న ప్రచారం చేసి.. జనం దగ్గరకి ఈ సినిమాను తీసుకెళ్లాలి అనేది ఇప్పుడు నా బుర్రలో ప్రతి క్షణం తొలుస్తున్న ఆలోచన’ అని సాయి రాజేశ్‌ పేర్కొన్నారు.

ఇది ‘ముగ్గురు భార్యలున్న ఒక మనసున్న భర్త కథ’ అని గతంలో సంపు తన సినిమా గురించి చెప్పారు. ‘హృదయ కాలేయం’తో అందర్నీ కడుపుబ్బా నవ్వించిన సంపు ఈ సినిమాతో ఎలా సందడి చేయబోతున్నారో తెలియాలంటే వేచి చూడాలి.   రూపక్‌ రొనాల్డ్‌ సన్‌ ‘కొబ్బరిమట్ట’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. స్టీవెన్‌ శంకర్‌ కథ అందించారు. నీలం సాయి రాజేష్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.