బ్యాక్ టు బ్యాక్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి రెండు పండుగలు రానున్నాయి. ఆర్ ఆర్ ఆర్ విడుదలైన రెండు రోజుల్లో ఆయన బర్త్ డే వేడుకలున్నాయి. ఆర్ ఆర్ ఆర్ విడుదలతో పాటు రామ్ చరణ్ లేటెస్ట్ ప్రాజెక్ట్ నుండి క్రేజీ అప్డేట్ బర్త్ డే కానుకగా రానున్నట్లు తెలుస్తుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (Ram Charan)వేడుకలకు మెగా ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. మార్చి 27న రామ్ చరణ్ తన 36వ బర్త్ డే జరుపుకోనున్నారు. ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఫ్యాన్స్ భారీ ఎత్తున వేడుకలు నిర్వహించనున్నారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లు ఫ్యాన్స్ వేడుకలకు దూరంగా ఉన్నారు. కోవిడ్ ఆంక్షలు అమలులో ఉండడంతో పాటు ఫ్యాన్స్ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వేడుకలు నిర్వహించవద్దని, గుంపులుగా సామూహిక కార్యక్రమాలు నిర్వహించవద్దని రామ్ చరణ్ స్వయంగా వేడుకున్నారు. 

రెండు సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఎటువంటి ఆంక్షలు లేకుండా జరుపుకునే అవకాశం ఫ్యాన్స్ కి దక్కింది. ఒక వైపు ఆర్ ఆర్ ఆర్ విడుదల కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ వేయి కన్నులతో వేచి చూస్తున్నారు. అయితే వాళ్ళ కోసం మరో సర్ప్రైజ్ కూడా ఆయన సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో చరణ్ RC15 చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నట్లు సమాచారం. 

దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ దాదాపు ఖాయమే అని ఇండస్ట్రీ వర్గాలు తెలియజేస్తున్నాయి. శంకర్ ఈ చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. సర్కారోడు అనే ఓ మాస్, పవర్ ఫుల్ టైటిల్ ప్రచారంలో ఉంది. మార్చి 27న దీనిపై పూర్తి స్పష్టత రానుంది. దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. గతంలో చరణ్-కియారా వినయ విధేయ రామ మూవీలో జంటగా నటించారు. 

ఇక ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)మార్చి 25న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR)-చరణ్ ల మల్టీస్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కింది. ఓవర్ సీస్ లో ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ బుకింగ్స్ మొదలైపోయాయి. యూఎస్ తో పాటు పలు దేశాల్లో ఆర్ ఆర్ ఆర్ బుకింగ్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. యూఎస్ లో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ వన్ మిలియన్ మార్క్ కూడా దాటేశాయి. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు.