ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్ కరోనా వల్ల సాధ్యం కావటం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు  నాలుగు నెలల కీలక సమయం ఇప్పటికే వృధా అయ్యింది. ఈ నేపధ్యంలో రాజమౌళి ప్రస్తుతం ఏ చేస్తున్నారు, షూటింగ్ ఎంతవరకూ పూర్తి అయ్యిందనే విషయమై అంతటా ఆసక్తి నెలకొని ఉంది. మీడియాలో ఈ విషయమై రూమర్స్ కానీ, అఫీషయల్ న్యూస్ రావటం లేదు. అయితే తాజాగా ఆ సినిమా  సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ఈ మూవీ షూటింగ్‌ ఇప్పటికే 70శాతం పూర్తి అయ్యిందని అన్నారు

 సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌ మాట్లాడుతూ...”మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించే సమయానికి ఆర్‌ఆర్‌ఆర్‌కి సంబంధించిన 70శాతం ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. షూటింగ్‌ అయిన దానికి ఎడిటింగ్‌ పనులు కూడా ఎప్పటికప్పుడు జరిగాయి, ఇప్పటివరకు డబ్బింగ్‌ కూడా పూర్తి అయ్యింది” అని సెంథిల్‌ అన్నారు. 

ఇక జూలైలోనే సెట్స్ మీదకు వెళ్లాలనుకున్నప్పటికీ.. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో షూటింగ్‌ను ప్రారంభించలేదని ఆయన తెలిపారు. ఒకటి లేదా రెండు నెలల్లో ఆర్ఆర్‌ఆర్‌ షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు ఆయన వివరించారు. 

ఇదిలా ఉంటే..రాజమౌళి అండ్‌ టీమ్‌ ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్‌ వర్క్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్స్‌తో కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలకు సంబంధించిన కొన్ని విషయాలను ప్రేక్షకులకు చెబుతారట రాజమౌళి. ప్రస్తుతం ఈ ఎపిసోడ్స్‌కు సంబంధించిన వర్క్‌ను వర్చువల్‌గా సూపర్‌వైజ్‌ చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారని సమాచారం. 

సముద్రఖని, శ్రియ, అజయ్‌ దేవగన్, అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌సన్‌ ఈ చిత్రంలో కీలక పాత్రధారులు. ఇప్పటికే 70 శాతానికిపైగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.