మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. స్వాతంత్ర్యసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కించిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రేమను కురిపిస్తున్నారు.

నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి అధ్బుతంగా నటించాడని  ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో అవుకు రాజు పాత్ర పోషించిన కిచ్చా సుదీప్ ని పొగుడుతున్నారు. చిరంజీవి తరువాత సినిమాలో ఆస్థాయిలో సుదీప్ మెప్పించగలిగారని అంటున్నారు. కిచ్చా సుదీప్ భార్య ప్రియా రాధాకృష్ణన్ కూడా తన భర్త నటన చూసి సంబరపడిపోయారు. 

మా ఆయన అధ్బుతంగా నటించాడంటూ మురిసిపోతున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అవుకురాజు పాత్రలో సుదీప్ ఎంతో సులభంగా నటించారని.. సినిమాలో ఆ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించడానికి చాలా ధైర్యం ఉండాలని.. 'సైరా నరసింహారెడ్డి' లాంటి సినిమా తీసినందుకు కొణిదెల ప్రొడక్షన్స్ కంపనీకి అభినందనలు చెప్పారు.

అలానే చిరంజీవిపై పొగడ్తల వర్షం కురిపించారు. చిరంజీవి తన నటనతో నోట మాట రాకుండా చేశారని.. ప్రతీ సన్నివేశంలో ఆయన కట్టిపడేస్తారని.. ఆయన ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇవ్వగలరని చెప్పింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డికి గొప్ప విజన్ ఉందని.. ఓ గొప్ప కలను సాకారం చేయగలిగారని.. 'సైరా' ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా అని చెప్పుకొచ్చింది.