'ఈగ' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దగ్గరయ్యారు సుదీప్. ఈ సినిమా అతడికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన 'సై రా' సినిమాలో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా.. నటుడు సుదీప్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో ఆయన చిరంజీవి గురించి సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

తనకు స్టార్ డంపై నమ్మకం లేదని.. స్టార్ డం అనేది రిలేషన్షిప్ లాంటిదని.. ఈరోజు మనతో ఉంటుంది.. రేపు మరొకరితో ఉంటుందని అన్నారు. కానీ ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఇక చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయన నుండి ఓ విషయం బాగా నేర్చుకున్నానని చెప్పారు. రాజకీయాల్లోకి మాత్రం వెళ్లకూడదని అది చిరు సర్ నుండే నేర్చుకున్నట్లు చెప్పారు.

పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్లు.. ఇప్పుడు దీనిని పక్కనబెట్టి రాజకీయాల్లోకి వెళ్లలేను అని చెప్పారు. తనను చాలా మంది రాజకీయాల్లోకి ఆహ్వానించారని కానీ తను వెళ్లలేదని అన్నారు. ఇండస్ట్రీలో కూడా రాజకీయాలు జరుగుతున్నాయని.. సినిమాకి మించిన రాజకీయాలు ఉండవని చెప్పారు. రాజకీయాల్లోకి వెళితే ఉదయం లేవగానే తిట్టుకుంటూ ఉండాలని.. అదే సినిమా ఇండస్ట్రీలో అయితే ఎవరు ఎక్కడ నుండి వచ్చారనేది కూడా తెలియదని అన్నారు. 

ఇటీవల సుదీప్ నటించిన 'పహిల్వాన్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడలో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చినా.. తెలుగులో మాత్రం ఫ్లాప్ గా మిగిలిపోయింది.