విజయ్, అట్లీలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన తేరి, మెర్సల్ లాంటి చిత్రాలు ఘనవిజయాలుగా నిలిచాయి. భారీ అంచనాల నడుమ బిగిల్ చిత్రం నవంబర్ లో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉండగా విజయ్ తదుపరి చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. 

ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించేందుకు విజయ్ ఒకే చెప్పాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతోందంటూ కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. తాజా సమాచారం మేరకు కియారా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. 

విజయ్ సరసన నటించేందుకు కియారా ఆసక్తి చూపింది. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో నటించలేనని చెప్పేసింది. ప్రస్తుతం కియారా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. భరత్ అనే నేను చిత్రంతో కియారా సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

అంతకు ముందు చిత్ర యూనిట్ రష్మిక మందనని కూడా సంప్రదించారు. ఆమె విషయంలో కూడా ఇదే సమస్య. విజయ్ లాంటి స్టార్ హీరో సరసన నటించాలని ఉన్నా అంతకు ముందే కమిటైన చిత్రాల వల్ల రష్మిక డేట్స్ ఖాళీగా లేవు. సౌత్ లో క్రేజీ హీరోగా కొనసాగుతున్న విజయ్ కు ప్రస్తుతం హీరోయిన్ల కొరత ఏర్పడినట్లుంది.