కథ: 

కోల్ కతా సెంట్రల్ జైల్లో కత్తి శీను(చిరంజీవి) ఇంట్రడక్షన్ తో కథ మొదలవుతుంది. జైలు నుంచి తప్పించుకున్నశీను హైదరాబాద్ కు వస్తాడు. అక్కడి నుంచి బ్యాంకాక్ కు వెళ్లే సమయంలో లక్ష్మి (కాజల్)ని చూసి ప్రేమలో పడతాడు. ఫారిన్ వెళ్లాలనుకున్నప్పటికీ లక్ష్మి కోసం ఆగిపోతాడు. ఆ సమయంలోనే ఒకరిపై హత్యాయత్నం జరగటం.. అతను తనలానే ఉండటంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు. తనలా ఉన్న శంకర్ (చిరంజీవి ద్విపాత్రాభినయం)ను కాపాడి ఆసుపత్రిలో చేరుస్తాడు. శంకర్ ఎవరంటే.. రైతుల పక్షాన నిలిచి వారి కోసం పోరాడే రైతు నాయకుడు.

 

మళ్లీ ఫారిన్ వెళ్లటానికి ప్రయత్నాలు చేసుకుంటున్న వేళ.. కత్తి శీనును శంకర్ గా భావించిన కలెక్టర్ అతన్ని రైతులున్న వృద్ధాశ్రమానికి తీసుకొస్తాడు. కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్(తరుణ్ అరోరా) రైతుల భూముల్ని కాజేసి.. అక్కడో శీతల పానీయాల కంపెనీని పెట్టాలనుకుంటాడు. కత్తి శీనును చూసిన అగర్వాల్ అతన్ని రైతు నాయకుడు శంకర్ గా అనుకొని.. రైతుల భూముల్ని తనకిచ్చేలా చేస్తే రూ.25కోట్లు ఇస్తామని బేరం పెడతాడు. దీనికి సరేనంటాడు శంకర్ రూపంలో ఉన్న కత్తి శీను.

 

రైతులను ఎలాగైనా ఒప్పించి.. తనకు ఇస్తానన్న 25కోట్లు తీసుకుని వెళ్లిపోవాలనుకుని..ప్లాన్ వేసి ఓల్డేజ్ హోంలో తిష్ట వేస్తాడు శీను. అయితే రైతులంతా.. శీనుకు సన్మాన కార్యక్రమం సందర్భంగా శంకర్ అనుకుని అతన్ని అక్కడికి తీసుకెళ్తారు. సన్మాన కార్యక్రమంతో.. శంకర్ ఆశయాలు కత్తి శీనుకు తెలుస్తాయి. రైతుల క్షేమం కోసం శంకర్ ఎంతగా తపిస్తాడన్నది తెలీటంతో పాటు.. అగర్వాల్ కుతంత్రం ఏమిటో అర్థమవుతుంది. దొంగే అయినా మంచి మనసున్న కత్తిశీను రైతుల పక్షాన నిలిచి.. శంకర్ ఆశయాల్ని అమలు చేయాలని నిర్ణయించుకుంటాడు. రైతుల భూముల్ని కాజేయాలనుకున్న అగర్వాల్ కుట్రకు చెక్ చెబుతూ.. రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తాడు. దీంతో కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ కు.. రైతు నాయకుడు శంకర్ గా మారిన కత్తి శీనుకు మధ్య పోరు మొదలవుతుంది.

 

అగర్వాల్ కుట్రను ఏ విధంగా అడ్డుకున్నాడు? రైతుల పంట భూములు కోల్పోకుండా చేశాడా? అగర్వాల్ కు చెక్ పెట్టేందుకు కత్తి శీను వేసిన వ్యూహం ఫలించిందా? శంకర్ ఏమయ్యాడు? లక్ష్మీ.. కత్తి శ్రీనుల ప్రేమకథ ఏమైంది? కత్తి శీను ఫారిన్ ప్రయాణం ఎటు మళ్లింది? అన్నవి తెలుసుకోవాలంటే వెండితెర మీద సినిమాను చూడాల్సిందే.

 

ఎలా ఉందంటే: 

వినోదం, సందేశం మేళవింపుగా సినిమా రూపుదిద్దుకుంది. కత్తి శీను పాత్ర ఎలా మలుపులు తిరుగుతుందీ.. అతడికీ, విలన్‌కీ మధ్య ఎలా యుద్ధం జరుగుతుంది. వంటి వాటిని దర్శకుడు ఆసక్తికరంగా మలిచారు. ఒక పక్క కథనం వేగంగా సాగుతుండగానే అలరించే పాటలూ, రైతుల పరిస్థితిని కళ్లకు కట్టే సన్నివేశాలూ, కామెడీ పంచ్‌లూ వరుస కడతాయి. ఇది 'కత్తి'కి రీమేక్‌. అయితే చిరంజీవి రేంజ్‌కి తగ్గట్టుగా పాటల్నీ, ఫైట్స్ నూ.. బాగా చిత్రీకరించారు. 'అమ్మడూ.. లెట్స్‌ డూ కుమ్ముడూ' పాటలో రామ్‌చరణ్‌ తళుక్కుమని మెరుస్తాడు. 'రత్తాలూ..' 'సన్నజాజిలా పుట్టేసిందిరో, మల్లెతీగలా చుట్టేసిందిరో' పాటలు హుషారెక్కిస్తాయి. 'అమ్మడూ లెట్స్‌ డూ కుమ్ముడూ' కుర్రకారుతో ఈలలేయిస్తుంది.

 

ఎవరెలా చేశారంటే: తొమ్మిదేళ్ల తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన చిరంజీవి మునుపటిలాగానే తన నటనతో రెండు పాత్రల్ని పండించారు. డాన్సుల్లోనూ ఒకప్పటి హుషారు కనిపిస్తుంది. చిరంజీవి సరసన కాజల్‌ అందంగా కనిపించింది. దర్శకుడిగా వి.వి. వినాయక్‌ చిరంజీవి ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథనాన్ని నడిపించారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం, రత్నవేలు ఫొటోగ్రఫీ బాగున్నాయి. బ్రహ్మానందం, పోసాని, జయప్రకాశ్‌రెడ్డి వాళ్ల పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ అంటే అది మెగాస్టార్ చిరంజీవే. 9 ఏళ్ల తరువాత స్క్రీన్ మీద ఆయన్ను ఫుల్ లెంగ్త్ హీరోగా చూడటం అభిమానులకు పండగే అని చెప్పాలి. చిరంజీవి కూడా బాగా వర్కవుట్స్ చేసి యంగ్ గా కనువిందు చేశారు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన అసామాన్యమైన నటన, డైలాగులు, ఫైట్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రతి పాటలోనూ చిరంజీవి వేసిన సూపర్ స్టెప్పులు ప్రేక్షకుల ఉత్సాహాన్ని తారా స్థాయికి తీసుకెళ్ళేలా ఉన్నాయి. రీమేక్ కథే అయినప్పటికీ ఒరిజినల్ వర్షెన్‌ను చిరంజీవికి తగ్గట్టుగా మలచడంలోనే ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. కాజల్ ఎప్పట్లానే తన అందంతో, నటనతో బాగా ఆకట్టుకుంది.

ఫస్టాఫ్‌ అంతా చిరు ఎనర్జిటిక్ డైలాగ్స్, యాక్టింగ్‌తో సరదాగా నడుస్తూనే ఇంటర్వెల్ రాబోయే ముందు ఒక్కసారిగా సీరియస్ గా మారిపోయింది. రైతుల సమస్యను కాస్త ఎలివేట్ చేయడంతో అద్భుతంగా తయారైంది. ఇక పాటలన్నీ మంచి ఊపు తెచ్చేవే కాకుండా, వాటిని అందమైన లొకేషన్స్‌ లో చిత్రీకరించడం, చిరు డ్యాన్సుల అదిరిపోయేలా ఉండటంతో అభిమానులకు కనులవిందు చేశాయి. ముఖ్యంగా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటలో రామ్ చరణ్ చిరంజీవితో కలిసి వేసిన స్టెప్పులు అభిమానులకు స్పెషల్ గిఫ్టనే చెప్పొచ్చు.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ లో  ప్రధానంగా కనిపించేది బలం లేని విలనే. చిరంజీవి అంతటి స్టార్ హీరోకి ఇమేజ్ ని సినిమాలో మోయాలంటే అంతే బలమైన ప్రతి నాయకుడు అవసరం. విలన్ ఎంత బలంగా ఉంటే హీరో అంత స్ట్రాంగ్ గా కనిపిస్తాడు. కానీ విలన్ పాత్ర అలా లేదు. చిరంజీవి ముందు చాలా వరకు చిన్నబోయింది. తరుణ్ అరోరా నటన కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.

ఇక ఫస్టాఫ్ రైతుల సమస్యను బలంగా చూపించినా... సెకండాఫ్లో అంతే బలంగా దానికి పరిష్కారం చూపడంలో దర్శక రచయితలు విఫలమయ్యారు. మీడియా కూడా సెన్సేషన్ ఉంటేనో లేక క్రియేట్ చేస్తేనో తప్ప కవరేజ్ ఇవ్వదంటూ సెటైర్ వేసే ప్రయత్నం చేసినా.. రైతుల స్టోరీ కావడంతో సీరియస్ నెస్ మెయింటైన్ చేశారు. క్లైమాక్స్ చిరంజీవి 150వ సినిమాకు ఉండాల్సిన స్థాయిలో లేదేమో అనిపిస్తుంది. అయితే అంతకు మించి ఏం చేసినా మొత్తం చెడిపోతుందనే అలా చేసి ఉండొచ్చు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా వీవీ వినాయక్ తనపై మోపిన అతిపెద్ద బాధ్యతను సమర్ధవంతంగానే పోషించాడని చెప్పాలి. మురుగదాస్ కథను చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చి, అభిమానులు ఏయే అంశాలు కోరుకుంటారో అవన్నీ ఉండేలా చూసుకుంటూ, కథలోని ఎమోషన్ దెబ్బతినకుండా వినాయక్ చూపిన ప్రతిభ మెచ్చుకోదగ్గది. దర్శకుడిగా ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాను అందించడంలో వినాయక్ విజయం సాధించాడు. ఇకపోతే సెకండాఫ్ విషయంలో, ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే, సినిమా రేంజ్ వేరేలా ఉండేది.

దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలన్నీ ఇప్పటికే సూపర్ హిట్. విజువల్స్ పరంగా చూసినప్పుడు ఆ పాటల స్థాయి మరింత పెరిగినట్లనిపించింది. కొరియోగ్రాఫర్లు లారెన్స్, జానీ మాస్టర్లు చిరంజీవి చేత వేయించిన స్టెప్పులు సినిమాకే మేజర్ హైలెట్ గా నిలిచాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ కీలక సన్నివేశాలన్నింటిలో దేవిశ్రీ పనితనం చూడొచ్చు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకో స్థాయిని తీసుకొచ్చింది. సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలు చాలా వరకు బలంగా తాకేలా, చిరు ఇమేజ్ కు తగ్గట్టు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. రామ్ చరణ్ పాటించిన నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి.

 

చివరగా : ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ చిరంజీవి ఇచ్చిన రీ ఎంట్రీ ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే ఉండటంతో ప్రేక్షకులకు నచ్చటం ఖాయం.