కన్నడలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `కేజీఎఫ్‌2`. రెండేళ్ళ క్రితం వచ్చిన `కేజీఎఫ్‌`కిది కొనసాగింపు. యంగ్‌ హీరో యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు. రవీనా టండన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. 

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కరోనా వల్ల షూటింగ్‌ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో తిరిగి చిత్రీకరణ ప్రారంభించేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నెల 26న తిరిగి  షూటింగ్‌ ప్రారంభించబోతున్నట్టు ఇటీవల  సహనిర్మాత కార్తీక్‌ గౌడ ప్రకటించిన విషయం తెలిసిందే. 

తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా కంఠీరవ స్టూడియోస్‌లో షూట్‌ చేయనున్నారట. క్లైమాక్స్ ఫైట్‌ మినహా పది రోజుల్లో షూటింగ్‌ మొత్తాన్నిపూర్తి  చేస్తామ`ని కార్తీక్‌ గౌడ తెలిపారు. కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌ జరుపుతామని వెల్లడించారు. షూటింగ్‌ పూర్తయ్యేంత వరకు ఎవరినీ బయటకు పంపమని, బయటివారిని లోపలికి రానివ్వమని చెప్పారు. అదిరిపోయే ప్లానింగ్‌తో షూట్‌ చేయబోతున్నట్టు వెల్లడించారు. 

ఇక ఇందులో సంజయ్‌ దత్‌ అత్యంత శక్తివంతమైన అధీర అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన ఇటీవల కాన్సర్‌కి గురికావడంతో చిత్ర బృందం టెన్షన్‌కి గురవుతుంది. అందుకే క్లైమాక్స్ ఫైట్‌ని వాయిదా వేస్తున్నారు. సినిమాకి ఇదే గుండెకాయ. సంజయ్‌ ఆరోగ్యం కుదుట పడ్డాక షూట్‌ చేయాలని భావిస్తున్నారు. మరి ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి. మొత్తంగా ఆయన షూటింగ్‌లో పాల్గొనేంత వరకు సస్పెన్స్ గానే ఉంది. 

మరోవైపు రవీనా టండన్‌ ఇందులో ప్రధానిగా కనిపించనున్నారు. రావు రమేష్‌ సైతం కీలక పాత్ర పోషించబోతున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని హోంబాలే ఫిల్మ్స్ తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, తమిళంలో తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండో భాగంలో దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.