కన్నడ హీరో యష్‌ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతుంది. రెండేళ్ల క్రితం యష్‌ కన్నడ చిత్ర పరిశ్రమకి తప్ప మరెవ్వరికీ పెద్దగా తెలియదు. కానీ `కేజీఎఫ్‌` చిత్రం ఆయన కెరీర్‌నే మలుపుతిప్పింది. ఓవర్‌నైట్‌లో స్టార్‌ని చేసిన సినిమా అది. ఈ సినిమా ప్రారంభం సమయంలో యష్‌ కూడా ఊహించి ఉండడు, తనకిది ఇంతటి ఇమేజ్‌ని గుర్తింపుని తీసుకొస్తుందని, కానీ ఆయన్ని ఈ సినిమా ఎక్కడో నిలబెట్టింది. తిరుగులేని స్టార్‌ని చేసింది. ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు యష్‌. 

కోలార్‌ గోల్డ్ మైనింగ్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం దీనికి రెండో భాగం రూపొందుతుంది. ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తుంది. సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌, రావు రమేష్‌ వంటి నటులు నటిస్తున్నారు. ఇటీవల యష్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్‌ సంచలనాలు సృష్టించింది. దాదాపు 120 మిలియన్స్ కిపైగా వ్యూస్‌ని దక్కించుకుంది. 

ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి యష్‌ అందుకుంటున్న రెమ్యూనరేషన్‌ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 2`కి ఆయన ఏకంగా ముప్పై కోట్లు అందుకుంటున్నారని సమాచారం. అంతేకాదు లాభాల్లో కొంత వాటా కూడా ఆయనకు చేరాలనే డీల్‌ కూడా ఉందట. ఈ లెక్కన యష్‌కి యాభైకి పైగానే ముట్టుతుందని శాండల్‌ వుడ్‌ సమాచారం.  `కేజీఎఫ్‌`మొదటి భాగానికి యష్‌ కేవలం రూ.15కోట్లే తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని డబుల్‌ చేశారు.

అయితే మన వద్ద యాభై కోట్లు అంటే పెద్ద లెక్క కాదు, ఎందుకంటే పవన్‌, మహేష్‌, ప్రభాస్‌, బన్నీ, చిరంజీవి వంటి హీరోలు దాదాపు సినిమాకి యాభై కోట్లకుపైగానే తీసుకుంటున్నారు. కానీ యాభై కోట్లు అంటే శాండల్‌వుడ్‌కి చాలా ఎక్కువ. అక్కడ యాభై కోట్లు ఓ సినిమా వసూలు చేయడమే గొప్ప. అలాంటి ఓ హీరో తన రెమ్యూనరేషన్‌గా యాభై కోట్ల వరకు తీసుకుంటున్నాడంటే నిజంగానే గొప్ప విషయం. అంతేకాదు కన్నడలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా నిలిచాడు యష్‌. `కేజీఎఫ్‌2` విడుదల తర్వాత యష్‌ రెమ్యూనరేషన్‌ మరింతగా పెంచే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే బంగారు గనులపై సినిమా తనకు బంగారు గనీగా మారిందని క్రిటిక్స్ కామెంట్ చేస్తున్నారు.