దేశవ్యాప్తంగా కెజిఎఫ్ 2 మూవీపై ఎంతటి హైప్ ఉందో టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అర్థం అవుతుంది. హీరో యష్ బర్త్ డే పురస్కరించుకొని కెజిఎఫ్ 2 టీజర్ విడుదల చేశారు. ఊహించిన విధానంగా అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతూ... కెజిఎఫ్ 2 టీజర్ విశేష ఆదరణ దక్కించుకుంటుంది. విడుదలైన 24గంటల్లో కెజిఎఫ్ 2 టీజర్ ఏకంగా 78 ప్లస్ మిలియన్ వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ నమోదు చేసింది. 

కెజిఎఫ్ 2 టీజర్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే దిశగా వెళ్లడం విశేషం. దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 చిత్రాన్ని మొదటి పార్ట్ కి మించి, గ్రాండ్ గా సిద్ధం చేశాడని టీజర్ ద్వారా అర్థం అవుతుంది. చాప్టర్ వన్ సక్సెస్ నేపథ్యంలో బడ్జెట్ పెంచుతూ మూవీని ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. త్వరలోనే కెజిఎఫ్ 2 విడుదల తేదీ ప్రకటించనున్నట్లు సమాచారం అందుతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న కెజిఎఫ్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. 

ఇక కెజిఎఫ్ 2 గత ఏడాదే విడుదల కావాల్సి ఉండగా... లాక్ డౌన్ పరిస్థుతుల కారణంగా ఆలస్యం అయ్యింది. కాగా కెజిఎఫ్ 2 లో మెయిన్ విలన్ అధీరా పాత్ర బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చేయడం విశేషం. అలాగే లేడీ పీఎం పాత్రలో రవీనా టాండన్ నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. మరి టీజర్ తో ఇన్ని రికార్డ్స్ నమోదు చేసిన చిత్రం బృందం... ట్రైలర్ తో మరెన్ని రికార్డ్స్ నమోదు చేస్తారో చూడాలి.