ఈ ఏడాది మొదట్లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకున్నాడు సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు. ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా ఉంటుందని ప్రకటించినా ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాడు. ఇటీవల మరో ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్ చేశాడు మహేష్‌. గీతా గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట పేరు సినిమాను ప్రకటించాడు. సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది.

అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. దీంతో దర్శకుడు కథా కథనాలను మరింతగా ఫైన్‌ ట్యూన్ చేస్తున్నాడు. అదే సమయంలో నటీ నటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా జరుగుతోంది. ఈ నేపధ్యంలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటించబోయే నటి ఎవరన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ డిస్కషన్‌కు ఎండ్‌ కార్డ్ వేసింది కీర్తి సురేష్‌.

లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా `మహానటి` ఫేం కీర్తి సురేష్ కూడా సోషల్ మీడియా లైవ్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అందులో భాగంగా తాను మహేష్‌ బాబు నెక్ట్స్ సినిమాలో నటించబోతున్నానని క్లారిటీ ఇచ్చింది కీర్తి సురేష్‌. ఇప్పటికే ఈ సినిమాలో విలన్‌గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించనున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమా ఇప్పట్లో సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశాలు మాత్రం కనిపించటంలేదు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గితే గాని షూటింగ్‌లకు హాజరు కానని మహేష్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడట. దాదాపు డిసెంబర్‌ వరకు మహేష్ షూటింగ్‌లలో పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది. అంటే సర్కారు వారి పాట సెట్స్‌ మీదకు వెళ్లేది డిసెంబర్‌ తరువాతే అని తెలుస్తోంది.