మహేశ్‌బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ ఇప్పుడిప్పుడే షూటింగ్‌ పనులు జరుపుకుంటోంది. ఈ  చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. ‘గీత గోవిందం’ ఫేం పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ క్యారక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కీర్తి సురేష్ ..గారంతో పెరిగి, ఎవరినీ లెక్క చేయని, ఓ యారగెంట్ పాత్రలో కనిపించబోతోంది. తనకు నచ్చిందే చేయటం తప్ప ఎదుటివారి సలహాలు సూచనలు పట్టించుకోదని అంటున్నారు. 

అలాంటి అమ్మాయి అమెరికాలో ఉంటుంది. అక్కడ... వడ్డీ వ్యాపారం చేసే మహేష్ దగ్గర అప్పు చేసి ఎగ్గొట్టి ఇండియా వస్తుందని చెప్తున్నారు. ఆమెను వెతుక్కుంటూ మహేష్ ఇండియా వస్తాడట. అక్కడనుంచి కథ మరో మలుపు తీసుకోబోతోందని చెప్తున్నారు. అయితే ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.  మైత్రి మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. ఎస్‌. తమన్‌ బాణీలు సమకూరుస్తున్నారు.

మరో ప్రక్క ఈ సినిమా ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌కు సంబంధించిన ఓ వార్త తెగ ప్రచారం అవుతోంది. సినిమా తమిళ శాటిలైట్‌ హక్కుల్ని ఓ ప్రముఖ ఛానల్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. చిత్రానికి డిమాండ్‌ ఉండటంతో సదరు ఛానెల్‌ ముందుగానే హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. మరి ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే దర్శక, నిర్మాతలు స్పందించాల్సిందే. సాధారణంగా మహేశ్‌ సినిమా విడుదలకు ముందు శాటిలైట్‌, డిజిటల్‌ హక్కుల బిజినెస్‌ పరంగా దాదాపు రూ.150 కోట్ల వరకు రాబడుతుందని టాక్‌.

మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. 

కీర్తి కెరీర్ విషయానికి వస్తే..‘నేను శైలజా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్‌. అలనాటి తార సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’తో ఆమెకు మంచి స్టార్‌డమ్‌ లభించింది. కమర్షియల్‌ సినిమాలతో పాటు, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ అలరిస్తున్న కీర్తి సురేశ్‌  మన్మథుడు 2లో గెస్ట్ రోల్ చేసింది. తరువాత పెంగ్విన్  మూవీలో కనిపించింది. తరువాత మిస్ ఇండియా ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతినిండా పని ఉంది. నగేష్ కుకునూర్ తెరకెక్కిస్తున్న గుడ్ లక్ సఖీ చిత్రంలో నటించనుంది. ఈ మూవీలో ఆది పిని శెట్టి లీడ్ రోల్ చేస్తున్నాడు. నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న రంగ్ దే మూవీలో కీర్తి హీరోయిన్  కాగా ఈ మూవీ షూట్ పూర్తయింది.