`ఈ నగరానికి ఏమైంది` ఆడిషన్‌లో తరుణ్ నన్ను రిజెక్ట్ చేశాడు.. `కీడా కోలా` యాక్టర్ ఎమోషనల్ వర్డ్స్..
`కీడాకోలా` చిత్రంలో లంచం పాత్ర లాయర్ గా నటించాడు రాగ్ మయూర్. తన నటనతో నవ్వులు పూయించాడు. తాజాగా ఆయన `కీడా కోలా` బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ ని పంచుకున్నాడు.

శుక్రవారం విడుదలైన చిత్రాల్లో విశేష ఆదరణ పొందుతున్న మూవీ `కీడా కోలా`. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్‌తోపాటు జీవన్, చైతన్య రావు, బ్రహ్మానందం, రవీంద్ర, విష్ణు, రాగ్ మయూర్ ప్రధాన పాత్రలు పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ పై ఈ చిత్రం విడుదలైంది. సినిమాకి మంచి స్పందన లభిస్తుంది. ఇందులో ముఖ్యంగా లంచం పాత్రలో నటించిన రాగ్ మయూర్ పాత్ర హైలైట్‌గా నిలిచింది. ఆయన పాత్రలో ఫన్ బాగా వర్కౌట్ అయ్యింది. తాజాగా రాగ్ మయూర్‌తో ఏషియానెట్ ఎక్స్ క్లూజివ్‌గా ముచ్చటించింది. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బ్రహ్మానందంతో వర్క్ ఎక్స్ పీరియెన్స్ ని, తరుణ్ భాస్కర్ తనని మొదట రిజెక్ట్ చేసిన విషయాన్ని తెలిపారు.
రాగ్ మయూర్‌కి `సినిమా బండి` మూవీ మంచి పేరుతెచ్చింది. కానీ అంతకంటే ముందే ఆయన `మెంటల్ మదిలో` చిన్న పాత్రలో మెరిశారు. అయితే ఆ తర్వాత `ఈ నగరానికి ఏమైంది` అనే సినిమా కోసం ఆడిషన్స్ కి వెళ్లాడు రాగ్. దానికి తరుణ్ భాస్కర్ డైరెక్టర్ అని తెలిసిందే. అయితే ఆ ఆడిషన్‌లో రాగ్‌ని రిజెక్ట్ చేశారట. దీంతో బాధపడి వెళ్లిపోయినా ఆయన్ని కొన్ని రోజుల తర్వాత తరుణ్ భాస్కర్ వెతుక్కుంటూ వచ్చారట. `సినిమా బండి`లో పాత్రకి మంచి పేరు రావడంతో అది చూసి తరుణ్ తనని ఒక యాడ్ కోసం అప్రోచ్ అయ్యారని చెప్పాడు. ఆ తర్వాత మరో యాడ్ కూడా చేశాడట. అది తనకు అద్భుతమైన ఫీలింగ్‌నిచ్చిందని వెల్లడించారు.
ఆ తర్వాత `కీడాకోలా` సినిమా స్టార్ట్ అవుతుందని ఆడిషన్ నిర్వహించారు. అందులో ఓకే అయ్యింది. అయితే `ఈ నగరానికి ఏ రోజైతే రిజెక్ట్ అయ్యానో, సరిగ్గా అదే రోజు `కీడా కోలా`సినిమాకి సెలక్ట్ అయినట్టు చెప్పారు రాగ్. ఇదొక సర్కిల్‌లా అనిపించిందని, అదొక బెస్ట్ ఫీలింగ్ అన్నారు. అయితే మనం సినిమాల్లోకి రావడం పెద్ద డ్రీమ్, అలాంటిది, రామానాయుడు స్టూడియో వద్ద మొదట్లో చిన్న సెల్ఫీ తీసుకున్నా, కానీ ఇప్పుడు అదే రామానాయుడు స్టూడియోలో `కీడాకోలా` ఫ్లెక్సీలో పెద్దగా నా ఫోటోని చూసుకుంటుంటే ఆ ఆనందాన్ని వర్ణించలేనన్నారు.
అంతేకాదు మొదటి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని కూడా ఫేస్ చేశానని, సినిమాకి అడ్డా అయిన సంధ్య థియేటర్ వద్ద పెద్ద ఫ్లెక్సీలో తన ఫోటోని చూసుకున్నప్పుడు అరే అవ్వా.. ఏం ఫీల్ రా ఇది అని సంతోషపడినట్టు తెలిపారు రాగ్. జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని ఫీలింగ్ అని వెల్లడించారు. దీంతోపాటు బ్రహ్మానందంతో పనిచేయడం మరో గొప్ప ఎక్స్ పీరియెన్స్ అన్నారు. కామెడీకి దిగ్గజం ఆయన అలాంటిది తొలి సినిమాకే ఆయనతో కలిసి పనిచేయడం, ఆయన పాత్రతో తన పాత్ర కూడా ట్రావెల్ కావడం అద్భుతమైన అనుభవమన్నారు రాగ్ మయూర్.
అయితే ప్రారంభంలో బ్రహ్మానందంతో కలిసి పనిచేయాలంటే చాలా భయమేసిందట. కానీ సెట్‌లోకి వెళ్లాక ఆయన అందరి ఆర్టిస్ట్ లని పిలిచి పరిచయం చేసుకుని జోకులేస్తూ ఫ్రీ చేశాడని తెలిపారు. తాను ఆయనకు భయాంకరమైన అభిమానిని అని చెబితే, ఆయనే భయపడుతూ జోకులేశారని, చాలా సరదాగా ఉంటారని తెలిపారు. మొత్తంగా `కీడా కోలా` మూవీ తనకు పెద్ద బ్రేక్ ఇచ్చిందని, తరుణ్ భాస్కర్‌ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని వెల్లడించారు. ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో బిజీగా ఉన్నట్టు వెల్లడించారు.