నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్, 
నీల్ నితిన్ ముఖేష్, పోసాని కృష్ణమురళి, హర్షవర్ధన్ రాణే తదితరులు 
సంగీతం: తమన్ 
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు 
నిర్మాత: నవీన్ చౌదరి 
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ మామిల్ల 

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం 'కవచం'. కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు మాస్ కమర్షియల్ సినిమాల్లో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ కి సరైన హిట్టు మాత్రం దక్కలేదు. ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటామనే నమ్మకంతో ఉన్నాడు బెల్లంకొండ. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయం అందుకున్నాడో.. సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
విజయ్(బెల్లంకొండ శ్రీనివాస్) విశాఖపట్టణంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. తన వృత్తి పట్ల ఎంతో నిజాయితీగా ఉండే విజయ్ కి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకోవాలని ఆశ. ఒకరోజు విజయ్ కాఫీ షాప్ లో పనిచేసే ఓ అమ్మాయిని(కాజల్) చూసి ఇష్టపడతాడు. ఆ విషయం అమ్మాయికి చెప్పేలోపు ఆమెకి మరొకరితో 
పెళ్లి కుదరడంతో ఆమెకి దూరమవుతాడు. ఇది ఇలా ఉండగా ఒక ప్రమాదంలో విజయ్.. సంయుక్త(మెహ్రీన్) అనే అమ్మాయిని కాపాడతాడు. 

ఆ తరువత విజయ్ తల్లికి యాక్సిడెంట్ కావడంతో డబ్బు విషయంలో సంయుక్త సహాయం చేయాలనుకొని కిడ్నాప్ డ్రామా ఆడదామని విజయ్ కి సలహా ఇస్తుంది. ఈ ఐడియా విజయ్ కి ఇష్టం లేకపోయినా.. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటాడు. సంయుక్తని కిడ్నాప్ చేసినట్లుగా ఆమె మావయ్యకి ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేస్తాడు. మరుసటి సంయుక్త నిజంగానే కిడ్నాప్ అయిందని విజయ్ ఆమెని కిడ్నాప్ చేశాడని న్యూస్ లో వార్తలు వస్తాయి.

ఆ వార్తలు చూసి విజయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. విజయ్ కి కాఫీ షాప్ లో కనిపించిన అమ్మాయే అసలు సంయుక్త అని తెలుసుకుంటాడు. మరి విజయ్ కి సంయుక్త పేరుతో పరిచయమైన మరో అమ్మాయి ఎవరు..? అసలు సంయుక్త స్టోరీ ఏంటి..? మధ్యలో ఈ కిడ్నాప్ డ్రామా ఏంటి..? అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ:
దర్శకుడు శ్రీనివాస్ మామిల్ల థ్రిల్లర్ జోనర్ లో నడిచే కథను రాసుకున్నాడు. ఆకట్టుకునే ట్విస్ట్ లతో మంచి కథనే సిద్ధం చేసుకున్నాడు. కానీ తెరపై ఆ కథను తెరకెక్కించే క్రమంలో కొన్ని తప్పులు దొర్లడంతో సినిమా ఆడియన్స్ ని పూర్తిగా నిరాశపరుస్తుంది. థ్రిల్లర్ స్టోరీ అంటే నేరేషన్ మొత్తం ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే విధంగా ఉండాలి. ఎలాంటి హీరో 
అయినా కథలో ఇన్వాల్వ్ అయి కథే ప్రాధాన్యంగా సినిమాను నడిపించాలి. కానీ ఈ సినిమాలో హీరో ఎలివేషన్ షాట్స్ కోసం, పాటల కోసం థ్రిల్లర్ కథను కాస్త కమర్షియల్ సినిమా ఫార్మాట్ లో నడిపించి విసిగించేశారు. 

రెగ్యులర్ మూస ధోరణిలో సాగే సినిమాల మాదిరి హీరో పరిచయ సన్నివేశాలు ఓ ఇంట్రడక్షన్ సాంగ్ తో ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా నడిపించారు. ఇంటర్వెల్ సమయానికి ఓ ట్విస్ట్ తో ముగించారు. తరువాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో కలిగినా.. కథనం చాలా స్లోగా నడిపించి విసిగించారు. సెకండ్ హాఫ్ స్లోగా నడుస్తూ ప్రీక్లైమాక్స్ కి చేరుకుంటుంది. క్లైమాక్స్ యాక్షన్ బాగున్నప్పటికీ యాక్షన్ సీన్ కోసం సాగదీసినట్లుగా అనిపిస్తుంది.

సెకండ్ హాఫ్ లో చాలా వరకు లాజిక్స్ మిస్ అయ్యాయి. పోలీసులు అంతా కలిసి హీరో కోసం సిటీ మొత్తం గాలిస్తుంటే.. హీరో మాత్రం ఓ క్యాప్ పెట్టుకొని బైక్ మీద సిటీ మొత్తం తిరుగుతూ సింపుల్ గా తన సమస్యలను పరిష్కరించుకుంటూ ఉంటాడు. ఇక హీరో గారు చేసే రెండు, మూడు మంచి పనులు చూసి హీరోయిన్ ప్రేమలో పడడం కామన్. దీని బట్టి సినిమాలో లవ్ స్టోరీ ఎంత వీక్ గా ఉందో అర్ధమవుతోంది. ఒక జోనర్ లో నడిపించాల్సిన సినిమాను అన్ని అంశాలు చేర్చేసి ఆడియన్స్ ని బాగా కన్ఫ్యూజ్ చేసేశారు. 

నటీనటుల పనితీరు:
బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో లుక్స్ పరంగా ఓకే అనిపించాడు. కానీ నటన విషయంలో మాత్రం ఎప్పటిలానే సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో కానిచ్చేశాడు. ఇక ఆయన డబ్బింగ్ వినడం ఎప్పటిలానే కాస్త కష్టంగా అనిపించింది. పోలీస్ పాత్రలో పవర్ ఫుల్ డైలాగ్స్ పలుకుతున్నా ఆడియన్స్ కి మాత్రం కనెక్ట్ అకావు. సినిమాలో ఇద్దరు 
హీరోయిన్లకి గ్లామర్ రోల్స్ దక్కాయి. తెరపై ఇద్దరూ చాలా అందంగా కనిపించారు. విలన్ గా నటించిన నీల్ నితిన్ స్క్రీన్ ప్రెజన్స్ ఆకట్టుకుంటుంది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో బాగా నటించాడు. కానీ అతడి పాత్రకి తెరపై ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కలేదు. హరీష్ ఉత్తమన్, పోసాని ఇలా ప్రతి ఒక్కరూ తమ పరిధులలో బాగానే నటించారు. 

సాంకేతికవర్గం పనితీరు: 
కథ, కథనాల్లో సత్తా ఉంటే సాంకేతికంగా ఎలాంటి లోపాలు ఉన్నా పెద్దగా కనిపించవు. కానీ ఈ సినిమాకి అవి లోపించడంతో టెక్నికల్ అంశాలు కూడా ఆకట్టుకునేలా లేవు. తమన్ అందించిన ఏ పాట కూడా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. నేపధ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా రిచ్ గా కనిపిస్తుంది. హీరో ఎలివేషన్ షాట్స్
ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సివుంది. క్వాలిటీ పరంగా సినిమా మెప్పిస్తుంది. దర్శకుడు శ్రీనివాస్ మామిల్ల ఓ కొత్త దర్శకుడి నుండి ఆశించే వైవిధ్యాన్ని చూపించలేకపోయాడు. కథనం విషయంలో మరింత శ్రద్ధ చూపించి ఉంటే బాగుండేది. ఈ సినిమా మెయిన్ బ్యాక్ డ్రాప్ కథనమనే చెప్పాలి. 

ఫైనల్ గా చెప్పాలంటే.. 
కథలో మలుపులు ఉన్నప్పటికీ ఆ మలుపులు ఆడియన్స్ ని ఆకట్టుకోలేక మరింత విసిగించడంతో బెల్లంకొండ శ్రీనివాస్ కి మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎదురుదెబ్బ తగ్గిలినట్లైంది. 

రేటింగ్: 2/5