బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ (Katrina Kaif - Vicky Kaushal)కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ముంబయిలోని ఓ పోలీస్ స్టేషన్ లో తాజాగా కేసు నమోదైంది. 

బాలీవుడ్ స్టార్స్ ను టార్గెట్ చేస్తూ కొందరు అపరిచితులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ మరియు ఆయన తండ్రికి బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ జరుపుతుండగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. ఎలాంటి మచ్చలేని, విమర్శలు లేని బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్ - విక్కీ కౌషల్ (Katrina Kaif - Vicky Kaushal)కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ప్రాణ హాని భయం కలిగింది. కొందరు ఈ స్టార్ జంటను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. 

2021లో విక్కీ కౌషల్ - కత్రినా కైఫ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సంప్రదాయ పద్దతుల్లోనే వీరి వివాహం జరిగింది. అప్పటి నుంచి వీరి దాంపత్య జీవితం సంతోషంగా కొనసాగుతోంది. ఇరువురు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. సమయం ఉన్నప్పుడల్లా వేకేషన్స్ కు వెళ్తున్నారు. కానీ తాజాగా వీరికి సోషల్ మీడియాలో హత్య బెదిరింపులు మొదలయ్యాయి. కత్రినాకు ఇన్‌స్టాగ్రామ్‌లో బెదిరింపులు వస్తుండగా.. విక్కీ కౌషల్ కు అదే సామాజిక మాధ్యమం నుంచి డెత్ థ్రెట్ అందినట్టు తెలుస్తోంది. నిందితులు కూడా కత్రినా కైఫ్‌ను వెంబడిస్తూ బెదిరిస్తున్నారని పోలీసులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే రంగంలోకి దిగారు. అపరిచితుడిని కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. 

తాజా సమాచారం ప్రకారం.. సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు రావడంతో పోలీసులు ముంబయిలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ జంటకు ప్రాణహాని ఉందనే ఆరోఫణలపై గుర్తు తెలియని వ్యక్తిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కానీ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలుపుతున్నారు. నిందితుడిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 506-II (నేరపూరిత బెదిరింపు) మరియు 354-డి (స్టాకింగ్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ జంటకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.