కత్తి మహేష్ మృతి: డ్రైవర్ సంచలన విషయాలు,మంత్రి ప్రకటన

మృతిపై అనుమానాలున్నాయని కత్తి మహేష్ తండ్రి ఓబులేషు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అంత్యక్రియల సందర్భంగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ సైతం కత్తి మహేష్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కత్తి మహేష్ మృతిపై న్యాయ విచారణ జరపాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Kathi Mahesh Driver Suresh Explains About Accident jsp

ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద క్రిష్ణ మాదిగతోపాటు కత్తి మహేష్ తండ్రి ఓబులేష్ ఫిర్యాదుల మేరకు ‘కత్తి మహేష్’ మృతిపై  ప్రభుత్వం స్పందించి విచారణ జరుపుతోంది. ప్రధానంగా మహేష్ మరణం గురించి ఆస్పత్రి ముందుగా తమకు తెలియజేయకుండా నేరుగా మీడియాకు ఎందుకు విడుదల చేశారని మహేష్ తండ్రి ఓబులేష్ ప్రశ్నిస్తున్నారు.

 ఈ మేరకు కోవూరు సీఐ ప్రమాదంలో కత్తి మహేశ్‌ కారు డ్రైవింగ్‌ చేస్తున్న సురేశ్‌ను పిలిచి విచారించారు. ఈ విచారణలో డ్రైవర్‌ ప్రమాదం జరిగిన తీరును ఇలా వివరించాడు. నిద్ర సమయం కావటంతో నెల్లూరులో ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకున్నామని, ఆ లోపే ఈ ఘటన జరిగిందన్నాడు. కంటైనర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించాడు.

ప్రమాదం సమయంలో కత్తి మహేశ్‌ నిద్రలో ఉన్నారని, సీటు బెల్టు కూడా పెట్టుకోకపోవడం వల్ల ఆయన ముందుకు పడినట్లుగా సురేశ్‌ వెల్లడించాడు. ఈ క్రమంలో ఎయిర్‌ బ్యాగ్స్‌ ఓపెన్‌ అయినప్పటికీ పగిలిన అద్దాల ముక్కలు మహేశ్‌ కంటికి గుచ్చుకున్నాయని అన్నాడు. ఆయనకు రక్తస్రావం అవుతుండటంతో హైవే పెట్రోలింగ్‌ పోలీసుల సాయంతో మహేశ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించామన్నాడు. అయితే అక్కడ ఐ స్పెషలిస్టు లేకపోవటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రి తరలిచించామని తెలిపాడు. మరీ ఈ ప్రమాదంలో మీకేందుకు గాయాలు కాలేదని పోలీసులు అడగడంతో తను సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే గాయాలు కాలేదని సురేశ్‌ సమాధానం ఇచ్చాడని పోలీసులు తెలిపారు.

ఈ విచారణ అనంతరం సురేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, ఈ కేసులో తనని అనుమానించాల్సిన అవసరం లేదన్నాడు. అవసరమైతే మళ్లీ పోలీసుల విచారణకు సహకరిస్తానని సురేశ్‌ పేర్కొన్నాడు. ఇక సీఐ రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి ట్వీట్‌తో మహేశ్‌ ప్రమాద ఘటనపై విచారణ జరిపాం అన్నారు. ఈ మేరకు కారు నడిపిన సురేశ్‌ను పిలిచి విచారించామని, ప్రమాదం జరిగిన తీరు గురించి వివరాలు అడిగినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిని విచారించాల్సి ఉందని సీఐ తెలిపారు. 

మరో ప్రక్క  ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయమై ప్రకటన చేశారు. కత్తి మహేష్ దళిత జాతిలో ఉన్నత స్థితికి ఎదిగిన వ్యక్తి అని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అని ఏపీ మంత్రి సురేష్ తెలిపారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా మహేష్ ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. వైద్య చికిత్స కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ.17 లక్షలు మంజూరు చేశారని గుర్తు చేశారు. కత్తి మహేష్ మృతిపై అనుమానాలు ఉన్నాయని కొందరు చేస్తున్న ప్రకటనలపై మంత్రి సురేష్ స్పందించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే విచారణ జరపటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మహేష్ కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటామని.. ప్రభుత్వం తరుఫున ఆదుకుంటామని మంత్రి సురేష్ హామీ ఇచ్చారు. వారికి ఏలోటు రాకుండా చూసుకుంటామని తెలిపారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios