దుబ్బాక ఉపఎన్నికలో ఇండిపెండెంట్‌ గా పోటీ చేస్తున్న న్యూస్ ఛానల్ యాంకర్ కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆమెపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. భూ వివాదంలో సెటిల్‌మెంట్ చేస్తానంటూ మోసం చేసినట్టు కత్తి కార్తీకపై ఆరోపణలు చేస్తున్నాడు. అమీన్‌పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు కంపెనీకి ఇప్పించేందుకు మధ్యవర్తిత్వం చేసినట్టు బాధితుడు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కార్తీక కోటి రూపాయలు డిపాజిట్ చేయించుకుందని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై కత్తి కార్తీక వివరణ ఇస్తూ మాట్లాడింది.నేనెవర్నీ మోసం చేయలేదు..అంటూ చెప్పుకొచ్చింది.

కత్తి కార్తీక మాట్లాడుతూ..‘అమిన్ పూర్ ల్యాండ్ ఇష్యూలో నేను ఎవర్నీ మోసం చేయలేదు. రాజకీయ కక్షలతోనే నాపై కేసులు పెడుతున్నారు. రెండు నెలల క్రితమే ఈ విషయంలో సదరు వ్యక్తికి లీగల్ నోటీసు ఇచ్చాము. సడన్‌గా ఇప్పుడెలా సివిల్ కేసులో చీటింగ్ కేసు నమోదు చేస్తారు. మొన్నటికి మొన్న నన్ను చంపుతామని బెదిరిస్తే రామయంపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశాను. ఒక మహిళగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి రాజకీయాల్లోకి వస్తే ఇన్ని అడ్డంకులా ?. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజకీయాలను వీడను. జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు 2023లో దుబ్బాక నుంచే పోటీ చేస్తాను' అని కత్తి కార్తీక చెప్పుకొచ్చారు. 

 ఇదిలా ఉంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కత్తి కార్తీక.. తన సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట ఇండిపెండెంట్ అభ్యర్థిగా దుబ్బాక ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.