సోషల్ మీడియా వేదికగా  మీటూ ఉద్యమం ఊపందుకుంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడే ట్వీట్ పడుతుందో..ఎవరి జీవితం రోడ్డున పడుతుందో అని చాలా మంది సినిమావాళ్లు బిక్కు బిక్కు మంటున్నారు. ఈ మీటూ కేవలం సినిమా రంగానికే పరిమితం కావటం లేదు..పలు రంగాల్లో మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గూర్చి సోషల్ మీడియాలో  బయటపెడుతున్నారు.   

కొందరు మాత్రం మీటూ ఉద్యమంలో నిజం లేదని... ఆ సంఘటన జరిగినప్పుడు బయిటపెట్టని  వారు ఇప్పుడు బయటికొచ్చి చెప్పడం వల్ల ఉపయోగం ఏముందని వాదిస్తున్నారు. ఆధారాలు లేకుండా మీటూ ఉద్యమం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేఫధ్యంలో అన్నమయ్య సినిమాలో నటించిన కస్తూరి ..మీటూ పై మాట్లాడారు. 

అన్నమయ్య, మా ఆయన బంగారం, సోగ్గాడి పెళ్లాం వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా చేసి అందరికీ సుపరిచితం  కస్తూరి. వివాహం తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. 2010లో మళ్లీ తమిళ పదం అనే తమిళ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిందామె. ఇప్పుడు మీటూ తో వార్తల్లో నిలిచారు. 

కస్తూరి మాట్లాడుతూ– ‘‘ప్రచారం కోసమే హీరోయిన్లు ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. వాటిని విభేదిస్తున్నాను. ఎవరైనా ఒక స్త్రీ వచ్చి తనకు ఇలా జరిగిందని చెప్పగానే మనం చేసే మొదటి పని ఆమెని జడ్జ్‌ చేయడం. ఇలా ఆరోపించడం వల్ల తనకు లాభం ఏంటి? అని ఆలోచిస్తున్నారు కూడా. అలాంటి సంఘటనలు బయటకు చెప్పడానికే ఎంతో ధైర్యం కావాలి. ఇలా చెప్పడం వల్ల తను ఏదో సాధిస్తుంది అనుకోవడం నిజం కాదు. 

అలాగే తప్పుడు ఆరోపణలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాలని, పాపులర్‌ అవ్వాలని ఏ స్త్రీ కోరుకోదు. మనం అనవసరంగా ప్రశ్నిస్తే ఇంకెప్పుడూ ఎవరూ ముందుకు వచ్చి తమ వేదనను పంచుకోరు.

ఇక  ‘లైంగిక వేధింపులు జరిగినప్పుడే ఎందుకు బయటకు చెప్పలేదు?’ అని చాలామంది అంటుంటే విన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవ్వరైనా వాటి నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తుంటారు తప్పితే పిర్యాదు చెయ్యాలనుకోరు. ఈ విషయంలో నేనిచ్చే సలహా ఏంటంటే స్త్రీలను ప్రశ్నించడం మానేసి, అలాంటి ఇబ్బందులు పెట్టిన వారి నుంచి సమాధానాలు రాబట్టడం మంచిదనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు