బాలీవుడ్ నటి సారా అలీఖాన్ తో కలిసి మళ్లీ మళ్లీ నటించాలనుందని.. యువరాణితో పని చేయడం కంటే ఇంకేం కావాలని అంటున్నారు యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్. సారా అలీఖాన్, కార్తిక్ ల కాంబినేషన్ లో 'లవ్ ఆజ్ కల్ 2' సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమా షూటింగ్ సోమవారం నాడు పూర్తయింది. ఈ క్రమంలో సారా భుజంపై తల వాల్చిన ఫోటోను కార్తిక్ సోషల్ మీడియాలో షేర్ చేసి ఓ పోస్ట్ పెట్టారు. ఈ ప్రయాణం ఎప్పటికీ ఆగిపోకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు.

'ఇంతియాజ్ అలీతో కలిసి పని చేస్తే ఎవరికైనా ఇలాగే ఉంటుందేమో.. 66 రోజులు షూటింగ్ లో పాల్గొన్నాం.. చాలా త్వరగా అయిపోయినట్లుగా ఉంది.. షూటింగ్ పూర్తయింది కానీ నేను పూర్తి కాకూడదని కోరుకున్నాను. నా డ్రీమ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీకి ధన్యవాదాలు.. ఈ ప్రయాణంలో యువరాణి సారా అలీఖాన్ తో కలిసి పని చేయడం కంటే ఇంకేం కావాలి.. ఆమెతో కలిసి మళ్లీ మళ్లీ నటించాలని అనుకుంటున్నా' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు.

సారా.. పటౌడీ నవాబ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె.. అందుకే ఆమెను కార్తిక్ యువరాణి అని పిలిచారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి  14న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.