తమ్మారెడ్డి భరద్వాజ.. `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ ప్రమోషన్స్ కోసం ఎనభై కోట్లు ఖర్చు చేశారని చెప్పారు.  తాజాగా దీనిపై రాజమౌళి తనయుడు, `ఆర్‌ఆర్‌ఆర్‌` లైన్‌ ప్రొడ్యూసర్‌ కార్తికేయ స్పందించారు. అసలు వాస్తవ ఖర్చులను ఆయన వెల్లడించారు.

రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా ఇండియాకి తొలి ఆస్కార్‌ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఇండియన్‌ టెక్నీషియన్లకి ఆస్కార్‌ వచ్చింది కానీ, ఇండియన్‌ మూవీస్‌కి ఆస్కార్‌ రాలేదు. ఇదే ఫస్ట్ టైమ్‌ అని చెబుతుంటారు. దీంతోపాటు `ది ఎలిఫెంట్‌ విష్పరర్స్` డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కూడా ఆస్కార్‌ దక్కిన విషయం తెలిసిందే. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో `నాటు నాటు` పాటకి ఆస్కార్‌ దక్కిన విషయం తెలిసిందే. ఇండియన్‌ సినిమాకి ఇదొక చరిత్ర. ఇదొక అరుదైన ఘనత. దేశం గర్వించదగ్గ విషయంగా చెప్పొచ్చు. 

అయితే `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ రావడానికి ముందు పెద్ద వివాదం నడిచింది. ఆస్కార్‌ ప్రమోషన్స్ విషయంలో టాలీవుడ్‌లో కొందరు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ `ఆర్‌ఆర్‌ఆర్‌` ఆస్కార్‌ ప్రమోషన్స్ కోసం ఎనభై కోట్లు ఖర్చు చేస్తున్నారని, అంతటి డబ్బు పెడితే ఎనిమిది సినిమాలు తీసి ముఖాన కొడతా అంటూ వ్యంగంగా స్పందించిన తీరు పెద్ద దుమారం రేపింది. టాలీవుడ్‌ని పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై నాగబాబు, దర్శకులు కె రాఘవేంద్రరావులు స్పందించడంతో ఈ వివాదం మరింత పెరిగింది. 

తమ్మారెడ్డి భరద్వాజ.. `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ ప్రమోషన్స్ కోసం ఎనభై కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. కానీ వంద కోట్లకుపైగానే రాజమౌళి ఖర్చు చేశారని టాలీవుడ్‌లో ఇన్‌సైడ్‌ వర్గాల్లో జరిగిన చర్చ. కానీ తాజాగా దీనిపై రాజమౌళి తనయుడు, `ఆర్‌ఆర్‌ఆర్‌` లైన్‌ ప్రొడ్యూసర్‌ కార్తికేయ స్పందించారు. అసలు వాస్తవ ఖర్చులను ఆయన వెల్లడించారు. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడారు. ఆస్కార్‌కి వెళ్లిన తీరుని ఆయన వెల్లడించారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాపై విదేశీయులు ఎక్కువ ఆసక్తి చూపించారట. ఓటీటీలో వచ్చినప్పటికీ థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపించారని, అందుకే అమెరికాలో రిలీజ్‌ చేయాలనుకున్నామని, కేవలం ఒక రోజు అరవై స్క్రీన్లలో షో వేయాలనుకున్నాం, కానీ ఒక్క రోజు అనుకుంటే నెల రోజులు గడిచిపోయింది. సినిమా చూశాక ఏం నచ్చిందని అడిగితే, చరణ్‌ని తారక్‌ ఎత్తుకుని చేసే ఫైట్‌ బాగా నచ్చిందన్నారు. పాటలు వస్తుంటే లేచి డాన్సులు చేశారని తెలిపారు. 

ఆస్కార్‌ ఈవెంట్‌కి వెళ్లడానికి సంబంధించి ఆయన చెబుతూ, ఈవెంట్‌లో పాల్గొనడానికి కీరవాణి, చంద్రబోస్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌, కాలభైరవ లకు మాత్రమే అకాడమీ ఆహ్మానం పంపింది. నామినీలకు, స్టేజీపై పర్మామ్‌ చేసేవాళ్లకు మాత్రమే అకాడమీ కమిటీ ఆహ్వానిస్తుంది. సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నీషియన్లకి టికెట్‌ కొనాల్సిందే, ఇందుకోసం నామినేషన్స్ లో ఉన్న వాళ్లు కమిటీకి ఈమెయిల్‌ ద్వారా రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. కీరవాణి, చంద్రబోస్‌ మా కోసం మెయిల్‌ చేశారు. అది చూసి వాళ్లు టికెట్‌ బుక్‌ చేసుకునేందుకు లింక్‌ పంపారు. ఆ టికెట్లలో రకరకాల క్లాసులుంటాయి. లోయల్‌ లెవల్‌ సీట్ల కోసం ఒక్కొక్కటి 1500 డాలర్లు( సుమారు లక్షల ఇరవై వేలకుపైనే) ఉంటుంది. టాప్‌లో కూర్చొని చూసేందుకు మా కుటుంబంలోని నలుగురికి 750 డాలర్లు పెట్టి టికెట్లు తీసుకున్నాం` అని తెలిపారు కార్తికేయ.

ఆస్కార్‌ కొనడమనేది పెద్ద జోక్‌ అని, 95ఏళ్ల చరిత్ర కలిగిన ఇనిస్టిట్యూట్‌ అది అని, అక్కడ ప్రతిదానికీ ఓ పద్ధతి ఉంటుందన్నారు. ఆడియెన్స్ ప్రేమని కొనగలమా ? స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్‌ల మాటలను కొనగలమా, కొనలేం కదా అని కౌంటరిచ్చారు కార్తికేయ. `హాలీవుడ్‌ సినిమాలు ఇలాంటి ప్రచారం కోసం స్టూడియోలను ఆశ్రయిస్తాయి. కానీ మాకు అలాంటి ఛాన్స్ లేదు. ప్రచారం కోసం మేం రూ. ఐదు కోట్ల బడ్జెట్‌ అనుకున్నాం. మొదటి దశలో మూడు కోట్లు ఖర్చు అయ్యింది. నామినేషన్స్‌ అయ్యాక సెకండ్‌ ఫేజ్‌లో బడ్జెట్‌ పెంచాం. మొత్తంగా ఎనిమిదిన్నర కోట్లు అయ్యింద`ని తెలిపారు కార్తికేయ. ఆస్కార్‌ కోసం ఎనభై కోట్లు ఖర్చు చేశారనే కామెంట్లకి క్లారిటీ ఇచ్చారు.