‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందిన  తాజా చిత్రం‘గుణ 369’. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌,  జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారమే రిలీజ్ అవుతోంది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమాతో అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. హిప్పీ చిత్రంతో వచ్చిన క్రేజ్ మొత్తం పోగొట్టుకున్న కార్తికేయ ఈ సినిమాతో నిలబడతాడా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చగా మారింది.   
   
ఇక ఇప్పటికే  ఈ సినిమా ఫిలింన‌గ‌ర్ టాక్  బయిటకు వచ్చింది. మీడియాలో స్ప్రెడ్ అవుతున్న ఆ టాక్ ప్రకారం గుణ‌369 జ‌స్ట్ బిలో యావ‌రేజ్. క‌థ‌లో కొత్త‌ద‌నం పెద్దగా లేదని… పాత క‌థ‌ల‌నే కొత్త‌గా మార్చి చూపారంటున్నారు. దానికి తోడు ఈ సినిమాకు పెద్ద‌గా బ‌జ్ కూడా క్రియేట్ కాలేదు లేదు. మరి ఈ కొద్దిపాటి బజ్ తో ఓపినింగ్స్ నామ మాత్రమే అని అంచనా వేస్తున్నారు. ఇక  గుణ 369 చిత్రంతో పోటీప‌డుతూ.. అదే రోజున బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టించిన `రాక్ష‌సుడు` రిలీజ్ అవుతోంది. ఇది త‌మిళ్ రీమేక్ మూవీ. అక్క‌డ సూపర్ హిట్ సినిమా. ఈ రెండు సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందో చూడాలి. 

కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఆర్‌ఎక్స్‌ 100’ పూర్తి చేసిన తర్వాత సినిమా హిట్‌ అయిపోతుందని నేను ప్రిపేర్‌ కాలేదు. హిట్‌ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాలేదు. మనకు తెలిసిన మేర కొన్ని కథలను ఎంచుకుంటాం. అర్జున్‌ చెప్పిన కథ వినగానే సినిమా చేస్తున్నామని చెప్పాను. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుందో.. స్టార్‌ డమ్‌ తెస్తుందనో కాదు... నన్ను నేను తెరపై చూసుకున్న సినిమా కావడంతో నాకు స్పెషల్‌ మూవీగా భావించాను. అర్జున్‌తో పనిచేస్తుంటే ప్రతి సెకనుకి 100 కోట్ల లాటరీ తగులుతున్నట్లు అనిపించింది. అంత కిక్‌ ఇచ్చింది. గుణ పాత్ర చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు. 

‘గుణ 369’ ద‌ర్శకుడు మాట్లాడుతూ ‘ మా చిత్రంలో హీరో పేరు గుణ‌. ‘369’ అంటే ఏంట‌నేది స్క్రీన్ మీదే చూడాలి.  ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది’ అని అన్నారు.

నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ ‘రియ‌ల్ ల‌వ్ ఇన్సిడెంట్స్ తో బోయ‌పాటి శిష్యుడైన అర్జున్ జంధ్యాల ఈ క‌థ‌ను అద్భుతంగా త‌యారు చేసుకున్నాడు. విన‌గానే చాలా ఇంప్రెస్ అయి వెంట‌నే ఓకే చెప్పేశాం. ల‌వ్ యాక్షన్ ఎంట‌ర్ టైన‌ర్ జోన‌ర్‌లో ఉంటుంది. క‌చ్చితంగా యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించే విధంగా ఉంటుంది. హీరో కార్తికేయ క్యార‌క్టరైజేష‌న్ ‘ఆర్ ఎక్స్ 100’, ‘హిప్పీ’ క‌న్నా చాలా విభిన్నంగా ఉంటుంది’ అని తెలిపారు. శివ మల్లాల ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్‌ సంగీతమందిస్తున్నారు. ఆర్‌ఎక్స్‌ 100 ఫేం రామ్‌ సినిమాటోగ్రాఫర్‌.