`ది కాశ్మీర్ ఫైల్స్`, `కార్తికేయ 2` చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఊరిని దత్తత తీసుకున్నారు. ఆయన మంత్రి పుట్టిన ఊరిని అడాప్ట్ చేసుకోవడం విశేషం.
ఇటీవల `ది కాశ్మీర్ ఫైల్స్`, `కార్తికేయ 2` చిత్రాలతో వరుసగా సంచలన విజయాలు అందుకున్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. రెండూ వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టాయి. నిర్మాతకు ఊహించిన లాభాలను తీసుకొచ్చాయి. ఇంకా చెప్పాలంటే కలెక్షన్ల పంట పండించాయి. ఈ ఊపులో మరిన్ని భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు అభిషేక్ అగర్వాల్. ఈ నేపథ్యంలో ఆయన ఓ గొప్ప కార్యానికి పూనుకున్నారు. ఓ ఊరిని దత్తత తీసుకున్నారు.
నగర శివారు విలేజ్ అయిన తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో చాలా వరకు తనవంతు సేవా కార్యక్రమాలు చేశారు అభిషేక్ అగర్వాల్. ఇప్పుడు విలేజ్‌ని దత్తత తీసుకోవడం విశేషం. రంగారెడ్డి జిల్లా, కందుకూరి మండలానికి చెందిన గ్రామమే తిమ్మాపూర్. యాదృశ్చికంగా ఇది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జన్మస్థలం కావడం విశేషం. అభిషేక్ అగర్వాల్, మంత్రి కిషన్ రెడ్డి మధ్య మంచి అనుబంధం ఉంది. వివిధ ఈవెంట్లు, ఫంక్షన్లలో వీరిద్దరు కలిసి కనిపిస్తుంటారు.
అభిషేక్ అగర్వాల్, అతని కుటుంబం చంద్రకళా ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన తండ్రి తేజ్ నారాయన్ అగర్వాల్ 60వ పుట్టిన రోజు, దివంగత అమ్మమ్మ శ్రీమతి చంద్రకళా 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం విశేషం. మరోవైపు చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివస్ అక్టోబర్ 30న మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని జీఆర్సీ కన్వెన్షన్ వేదిక కానుంది.
ఇదిలా ఉంటే దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుంటాయి. ఓ కేంద్ర మంత్రి, పలు మార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సొంత గ్రామాన్ని మరొకరు దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏముందని, మంత్రి స్థాయిలో ఉండి కూడా వేరొకరు దత్తత తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందా? అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో రెండు సినిమాలతో భారీ విజయాలు అందుకున్న నిర్మాతకి అభివృద్ధికి నోచుకోని గ్రామాలు కనిపించడం లేదా? ఆ గ్రామాన్నే ఎందుకు దత్తత తీసుకోవాల్సి వచ్చిందంటూ ప్రశ్నిస్తుండటం గమనార్హం.
