చిరంజీవి అభిమానులకే కాదు... తెలుగు సినీ ప్రేమికులందరికీ ఇష్టమైన టైటిల్  'ఖైదీ' . 1983 లో వచ్చిన ఈ చిత్రం మెగా హిట్టై చిరంజీవి ఎన్నో మెట్లు కెరీర్ పరంగా ఒక్కసారిగా ఎక్కించింది. దాంతో ఆ టైటిల్ తో సినిమా చేసే ధైర్యం రామ్ చరణ్ సైతం చెయ్యలేకపోయారు. కానీ ఇప్పుడు తమిళ హీరో కార్తి తన తాజా చిత్రానికి ఇదే టైటిల్ పెట్టి ప్రాజెక్టుకు  క్రేజ్ తెచ్చే పనిలో పడ్డారు. 

కార్తి హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రం రూపొందుతోంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఖైదీ అనే పేరును ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదలచేసింది. రక్తంతో నిండిన జైలు ఊచల వెనుక కార్తి ముఖంతో కూడిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇదని,హై స్టాండర్డ్స్ ఉన్న టెక్నీషియన్స్ , నటీనటులతో ఈ సినిమా కోసం కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని కార్తి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. వందశాతం యాక్షన్ గ్యారెంటీ ఉన్న సినిమా ఇదని నిర్మాత ఎస్.ఆర్. ప్రభు తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్ వుండదని సమాచారం. ఇదో థ్రిల్లర్.