మేవాడ్ మహారాణి పద్మావతి జీవితం ఆధారంగా తెరకెక్కించిన పద్మావత్ చిత్రం రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్‌పుత్‌ మహారాణి పద్మిని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పద్మావత్‌’ సినిమాపై ఎట్టకేలకు కర్ణిసేన శాంతించింది. ఈ సినిమాపై ఇకపై ఆందోళనలు చేయబోమని వెల్లడించింది. తాజాగా కర్ణిసేనకు చెందిన కొందరు ప్రముఖులు పద్మావత్‌ సినిమా చూసి మనసు మార్చుకున్నారు. సినిమాలో రాజ్‌పుత్‌ల శౌర్యాన్ని గొప్పగా ప్రశంసించారని, సినిమా తమ గౌరవాన్ని మరింత పెంచేలా ఉందని శ్రీ రాజ్‌పుత్‌ కర్ణిసేన ముంబయి నాయకుడు యోగేంద్ర సింగ్‌ కటార్‌ వెల్లడించారు.

 

కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ సూచన మేరకు ముంబయిలో కొందరు కర్ణిసేనకు చెందిన వారు సినిమా చూసినట్లు చెప్పారు. ప్రతి రాజ్‌పుత్‌ సినిమా చూసి గర్వపడతారని అన్నారు. గతంలో ‘పద్మావత్‌’ సినిమా విడుదల చేయొద్దని కర్ణిసేన పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. రాణి పద్మిని జీవిత చరిత్ర వక్రీకరించారని ఆరోపిస్తూ వారు ఆందోళనలు  చేశారు.

 

సినిమాలో దిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ, రాణి పద్మినీల మధ్య అభ్యంతకర సన్నివేశాలేమీ లేవని యోగేంద్ర సింగ్‌ స్పష్టంచేశారు. ఇకపై కర్ణిసేన సినిమాపై ఎలాంటి ఆందోళనలు చేపట్టదని వెల్లడించారు. అలాగే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లతో పాటు దేశవ్యాప్తంగా సినిమా ప్రదర్శనకు సహకరిస్తామని ప్రకటించారు. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొణె రాణి పద్మిని పాత్రలో నటించిన పద్మావత్‌ జనవరి 25న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కర్ణిసేన ఆందోళనల కారణంగా గుజరాత్‌, హరియాణాల్లోని కొన్ని థియేటర్ల యజమానులు ఈ చిత్ర ‌ ప్రదర్శనకు ముందుకు రాలేదు. తాజాగా కర్ణిసేన ఆందోళనలు విరమించడంతో... ఆయా చోట్ల సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.