స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆమె కొడుకు తైమూర్ కి కూడా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. తైమూర్ ఇంటి నుండి బయటకి వచ్చిన ప్రతీసారి ఫోటోగ్రాఫర్లు కెమెరాలు క్లిక్ మనిపిస్తునే ఉంటారు.

తైమూర్ ఎక్కడకి వెళ్తున్నాడు..? ఎలాంటి బట్టలు వేసుకున్నాడు..? ఇలా ప్రతి విషయంపై ఆసక్తి కనబరుస్తూనేఉంటారు. అయితే అభిమానించే వారితో పాటు విమర్శించే వారు కూడా ఉన్నారని అంటోంది కరీనా కపూర్. ఈ క్రమంలో ఆమె ఓ విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

సోషల్ మీడియాలో ఓ నెటిజన్.. 'పాపం.. తైమూర్ ఆకలితో చచ్చిపోతున్నాడు.. కరీనా ఆహారం పెట్టడం లేదు. వారు అసలు మంచి తల్లితండ్రులే కాదు' అంటూ కామెంట్ చేశాడు. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంటుందని చెప్పుకొచ్చింది కరీనా.

అందుకే అతడికి తగిన సమాధానం చెప్పాలని నిర్ణయించుకొని.. తైమూర్ బాగా తింటాడని, ఈ మధ్య కాస్త బొద్దుగా కూడా అయ్యాడని సమాధానం చెప్పినట్లు వెల్లడించింది. తైమూర్ విషయంలో మీడియా అత్యుత్సాహం చూపడంపై అసహనం వ్యక్తం చేసింది కరీనా. రెండేళ్ల పిల్లాడి వ్యక్తిగత జీవితంలోకి చొరబడడం ఏంటని ప్రశ్నించింది. తైమూర్ బాల్యాన్ని ఆనందంగా గడపనివ్వండంటూ కోరింది.