బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను కరీనా ఖండించింది. తనకు రాజకీయాలపై ఎటువంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

'లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ విషయంపై నన్ను ఎవరూ సంప్రదించలేదు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాల మీదే ఉంది' అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్‌సభ స్థానం నుండి కరీనా కపూర్ ని బరిలోకి దించాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

భాజాపాను ఓడించడానికి కరీనా బెస్ట్ ఆప్షన్ అని కార్పొరేటర్ యోగేంద్ర సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లెటర్ రాసినట్లు రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయాలన్నింటినీ కొట్టిపారేసింది కరీనా.

గతంలో మాధురి దీక్షిత్ పై కూడా ఇలాంటి వార్తలే వస్తే ఆమె కూడా ఈ వార్తలని ఖండించింది. ప్రస్తుతం కరీనా హీరోయిన్ గా 'గుడ్ న్యూస్' అనే సినిమాలో నటిస్తోంది. సెప్టెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.