'గీత గోవిందం' సినిమాతో సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక జంట మరోసారి కలిసి నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై ఈ సినిమాను నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేశారు.

విడుదలకు ముందు నాలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ నిర్వహించి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇది ఇలా ఉండగా.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ డియర్ కామ్రేడ్ సినిమాను చూసి మెచ్చుకున్నారని ఓ ఇంటర్వ్యూలో విజయ్ చెప్పుకొచ్చాడు.

సినిమా నచ్చి హిందీ రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో కరణ్ జోహార్ తనతో సినిమా చేయాలని కోరినట్లు విజయ్ దేవరకొండ చెప్పారు. కరణ్ జోహార్ అలా అడగడంతో చాలా గర్వంగా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చాడు విజయ్. ఇక 'డియర్ కామ్రేడ్' గురించి మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితమే కథ విన్నానని.. అప్పటికే కొన్ని సినిమాలు ఒప్పుకోవడంతో ఈ కథ చేయడానికి సమయం పట్టిందని.. ఏడాది పాటు ఈ సినిమా షూటింగ్ చేశామని.. సరైన సమయంలో సినిమాను విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు.

ఈ సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ తో తనకు మంచి బంధం ఏర్పడిందని.. త్వరలోనే వారితో మరో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఆ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడు.