సీనియర్ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇటీవల ధఢఖ్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు గాని జాన్వికి మాత్రం క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. అమ్మడి గ్లామర్ అలాగే యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. 

అయితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపిస్తేనే హిట్టయినట్లు లెక్క. మొదటి నుంచి జాన్వీ కెరీర్ కు గాడ్ ఫాదర్ లా వ్యవహరిస్తున్నాడు కరణ్ జోహార్. ఆమె కెరీర్ తన బాధ్యత అని శ్రీదేవి బ్రతికుండగానే ఆమెకు మాట కూడా ఇచ్చాడు. అయితే ధఢఖ్ మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. దీంతో జాన్వీ కెరీర్ పై కరణ్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఎందుకంటే ఇదివరకే ఒక సినిమాకు జాన్విని ఫైనల్ చేసిన కరణ్ ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరో థ్రిల్లర్ కథకు కూడా ఈ బ్యూటీని ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాకు ధఢఖ్ డైరెక్టర్ శశాంక్ ఖైతన్ దర్శకత్వం వహించనున్నాడు. మొత్తానికి కరణ్ జోహార్ జాన్వి కపూర్ ని స్టార్ హీరోయిన్ గా మార్చే వరకు వదిలేలా లేడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.