బాక్సాఫీస్ వద్ద కాంతార జోరు ఏమాత్రం తగ్గలేదు. వర్కింగ్ డే సోమవారం కూడా సాలిడ్ కలెక్షన్స్ తో ఈ చిత్రం దుమ్మురేపింది. దాదాపు ఓపెనింగ్ డే వసూళ్లకు దగ్గరగా మూడవరోజు వసూళ్లు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కాంతార చిత్ర ప్రభంజనం కొనసాగుతోంది. ప్రేక్షకులు ఈ సినిమా పట్ల విపరీతమైన ఆసక్తితో ఉన్నారు. దానికి వసూళ్ల లెక్కలే నిదర్శనం. ఏమాత్రం స్టార్ క్యాస్ట్ లేని ఒక డబ్బింగ్ మూవీ ఈ స్థాయిలో ఆదరణ దక్కించుకోవడం విశేషం. సినిమాలో కంటెంట్ ఉంటే భాష, ప్రాంతీయ బేధాలు లేకుండా తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారని కాంతార చిత్ర విజయం నిరూపించింది.
మూడు రోజులకే కాంతార డబుల్ బ్లాక్ బస్టర్ గా అవతరించింది. వీకెండ్ ఘనంగా ముగించిన కాంతార వర్కింగ్ డే సోమవారం కూడా అదే జోరు కనబరిచింది. ఏమాత్రం వెనక్కి తగ్గిన సూచనలు లేవు. ఏపీ/తెలంగాణాలలో కాంతార మూడవ రోజు రూ. 1.90 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇది ఓపెనింగ్ డే షేర్ కి చాలా దగ్గరగా ఉంది. ఫస్ట్ డే కాంతార రూ. 2.10 షేర్ రాబట్టింది. సెకండ్ డే ఆదివారం ఫస్ట్ డేకి మించిన వసూళ్లు దక్కాయి. రెండవ రోజు రూ. 2.80 షేర్ అందుకుంది.
మూడు రోజులకు ఏపీ/తెలంగాణాలలో కలిపి రూ. 6.80 కోట్ల షేర్, రూ. 13.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. నిర్మాత అల్లు అరవింద్ కేవలం రూ. 2 కోట్లకు కాంతార చిత్ర తెలుగు హక్కులు సొంతం చేసుకున్నారు. ఇప్పటికే రూ. 4.80 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. కాంతార రన్ ముగిసే నాటికి రూ. 10 నుండి 15 కోట్ల షేర్ ఈ మూవీ రాబట్ట వచ్చనేది ట్రేడ్ వర్గాల అంచనా.
రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించి నటించారు. కర్ణాటకలో సెప్టెంబర్ 30న ఈ చిత్రం విడుదలైంది. అక్కడ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో తెలుగు,హిందీ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల చేశారు. కెజిఎఫ్ నిర్మాతలు కాంతార నిర్మించడం విశేషం.
