ప్రకృతి - మానవాళికి మధ్య ఉండాల్సిన సంబంధాలను తెలియజేస్తూ తెరకెక్కిన ‘కాంతార’ సినిమాలో ‘వరాహ రూపం’ పాటకు ప్రేక్షకుల నుంచి విశేషణ ఆదరణ లభించింది. ఇప్పుడు ఆ పాటని ప్రదర్శించకూడదని కోర్టు తీర్పు ఇచ్చింది.
రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా తెరకెక్కిన కాంతార సినిమా జాతీయస్దాయిలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. మొదట కన్నడలో రిలీజయి సక్సెస్ సాధించిన తర్వాత హిందీ, తెలుగు భాషల్లో భారీ విజయం సాధించింది. 20 కోట్లతో తీసిన ఈ సినిమాకి ఇప్పటికే దాదాపు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రేక్షకులతో పాటు స్టార్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని అభినందిస్తున్నారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ సినిమాకు తాజాగా ఎదురుదెబ్బ తగిలింది.
భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రత్యేకంగా భావించే ‘వరాహ రూపం’ పాటను ఇకపై ప్రదర్శించకూడదని కేరళలోని కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశించింది. తాము రూపొందించిన ‘నవరసం’ ఆల్బమ్‌కు కాపీగా ‘వరాహ రూపం’ తీర్చిదిద్దారని పేర్కొంటూ కేరళకు చెందిన ‘థాయికుడమ్ బ్రిడ్జ్’ అనే మ్యూజిక్ బ్యాండ్ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విచారణ అనంతరం తాజాగా ఈ తీర్పు వెలువడింది. దీంతో, వారి అనుమతి లేకుండా థియేటర్లలోనే కాకుండా యూట్యూబ్, ఇతర మ్యూజిక్స్ యాప్స్‌లోనూ దీన్ని ప్రదర్శించకూడదని కోర్టు పేర్కొంది. దీన్ని తెలియజేస్తూ థాయికుడమ్ బ్రిడ్జ్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ విషయంలో తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పింది.
వాస్తవానికి సినిమాలో ఇదే కీలకాంశం. భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లి దేవత ఆవహించిన సమయంలో వచ్చే ఈ పాట ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో రిషబ్ నటనకు ఈ పాట తోడవడంతో ఆ సీన్స్ నెక్ట్స్ లెవిల్ కి వెళ్లాయి.
త్వరలోనే ఒటీటీలో కూడా విడుదల కావటానికి రంగం సిద్దమవుతున్న ఈ సమయంలో ఇది పెద్ద దెబ్బే. కలెక్షన్స్ ఇప్పటికే 200 కోట్లకు పైగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాల్లో 20 కోట్ల వసూళ్లు దాటేంది. అల్లు అరవింద్ ఈ సినిమా తెలుగు హక్కులను కొన్నారు. మరో ప్రక్క 2019 లో విడుదల అయిన పింగారా సినిమాకు ఇది కాపీ అంటున్నారు. భూతకోల నాట్యం, తుళు సంస్కృతి సాంప్రదాయాలను ఆధారం చేసుకొని 2019లోనే పింగారా వచ్చింది. కన్నడ, తుళు భాషలో వచ్చిన ఈ సినిమా 67వ నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ తుళు చిత్రం గా కూడా అవార్డు తీసుకుంది. కాంతారా సూపర్ హిట్ కావడంతో పింగారాను తెలుగులో విడుదల చేస్తున్నారు.
