కర్ణాటకలో మరో కొత్త రాజకీయ పార్టీ నూతన పార్టీని ప్రకటించిన కన్నడ స్టార్ ఉపేంద్ర ఉపేంద్ర పార్టీ పేరు 'కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ'
కన్నడ సూపర్ స్టార్, డైరెక్టర్ ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకూ పలు సినిమాలతో దగ్గరయ్యారు. సూపర్ స్టార్ ఉపేంద్ర ఇప్పుడు రాజకీయాల్లోకొచ్చారు. గత కొంత కాలంగా పలు సమస్యలపై స్పందిస్తున్న ఉపేంద్ర తాజాగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. 'కర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ' పేరుతో లోగోను కూడా ఆవిష్కరించారు. బెంగళూరులోని గాంధీభవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తన పార్టీ సిద్ధాంతాలను మీడియాకు ఉపేంద్ర వివరించారు.
పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని,తన పార్టీ ఆ దిశగానే పని చేస్తుందని ఉపేంద్ర అన్నారు. ఇది తన పార్టీ కాదని, ప్రజల పార్టీ అని చెప్పారు. ప్రజల కోసం తాను ఒక వేదికను మాత్రమే సిద్ధం చేశానని... తన అభిప్రాయాలతో ఏకీభవించేవారంతా పార్టీలో భాగస్వాములు కావచ్చని స్పష్టం చేశారు. సమాజంలో మార్పును తీసుకురావడమే తన కల అని, రైతులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రాజకీయాల్లో ధనం ప్రభావం బాగా పెరిగిపోయిందని... దాన్ని అంతం చేయడానికి శాయశక్తులా పోరాటం చేస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఉన్నత విద్యావంతులై ఉంటేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ఉపేంద్ర భార్య ప్రియాంక కూడా హాజరయ్యారు. అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అందరూ ఖాకీ దుస్తులు ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
