కరోనా మహమ్మారి సెలబ్రిటీలను వెంటాడుతుంది. ఇప్పటికే అనేక మంది స్టార్స్ కరోనాతో పోరాడారు. మరికొందరు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఇందులో కొందరు కరోనాతో పోరులో ఓడిపోయి తనువుచాలించారు. తాజాగా బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె తాజాగా ప్రకటించింది. నిన్న(శుక్రవారం) టెస్ట్ చేయించుకోగా, నేడు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.

`గత కొన్ని రోజులుగా కళ్లలో మంటగా అనిపిస్తుంది. అలసిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. బలహీనంగా ఉన్నాను. హిమాచల్‌ వెళ్లాలనిపించింది. వెళ్లే ముందు నిన్న టెస్ట్ చేయించుకున్నా. ఈ రోజు ఫలితం వచ్చింది. కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో నాకు నేను క్వారంటైన్‌ అయ్యాను. ఈ వైరస్‌ నా శరీరంలో ఎక్కడ ఉందనే విషయం నాకు తెలియదు. కానీ దాన్ని నేను ఓడిస్తానని నాకు తెలుసు. ప్రజలు ఎవరూ దీనికి భయపడకండి. ఎందుకంటే భయపడితే మరింత భయపెడుతుంది. రండి ఈ కోవిడ్‌19ని నాశనం చేద్దాం. ఇదొక చిన్న ఫ్లూ లాంటిది తప్ప మరేది కాదు. కాకపోతే ఎక్కువగా వచ్చింది` అంటూ హరహర మహాదేవ్‌ అని పేర్కొంది కంగనా. ఈ మేరకు ఆమె ఇంట్లో దైవ సన్నిధిలో ద్యానం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోని పంచుకుంది కంగనా. దీంతో ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నారు. ధైర్యాన్నిస్తున్నారు.