ఆమె ఎవరో తెలియదు.. అలాంటి వారు ఉన్నారా!: ఏపీ మంత్రి రోజాపై కంగనా కామెంట్స్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజా చిత్రం ‘చంద్రముఖి-2. పి వాసు దర్శకత్వంలో లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం.. సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజా చిత్రం ‘చంద్రముఖి-2. పి వాసు దర్శకత్వంలో లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం.. సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. చంద్రముఖి-2 ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం మంగళవారం చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే కంగనా రనౌత్ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన కంగనా రనౌత్.. ఏపీ మంత్రి రోజా ఎవరో తనకు తెలియదని అన్నారు.
తాను అసలు సిసలైన దేశ భక్తురాలినని కంగనా రనౌత్ పేర్కొన్నారు. అందుకే తనవంతుగా పేదలకు తోచిన సాయం చేస్తున్నానని తెలిపారు. అయితే కంగనా అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తానని కంగనా రనౌత్ చెప్పడంతో.. రాజకీయాల్లోకి వస్తే సినిమాలు వదులుకోవాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఏపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు.
అయితే ఇందుకు బదులిచ్చిన కంగనా రనౌత్.. రోజా అంటే ఎవరో తనకు తెలియదని అన్నారు. అలాంటివారు ఉన్నారన్న విషయమే తనకు తెలియదని.. ఆమె గురించి తానేం మాట్లాడతానని అన్నారు. ఇక, రోజా తెలియదంటూ కంగనా రనౌత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.