కంగనా రనౌత్‌ వివాదం ఇప్పుడు బాలీవుడ్‌నే కాదు, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని షేక్‌ చేస్తుంది. ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వానికి, కంగనాకి మధ్య ఓ యుద్ధమే జరుగుతుంది. శివసేన నాయకుల నుంచి తనకు హాని ఉందని ఇప్పటికే కంగనా వరుస ట్వీట్లు చేసింది. దీంతో ఆమె కోరిక మేరకు `వై ప్లస్‌` కేటగిరి భద్రతని కల్పించింది కేంద్ర హోంశాఖ. 

మరోవైపు ముంబయి పోలీసులపై విరుచుకుపడింది. తనకు ముంబయి  పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లా కనిపిస్తుందని, సంచలన ఆరోపణలు చేశారు. దీంతో శివసేన ఎంపి సంజయ్‌ రౌత్‌వంటి పలువురు ఆమెపై విమర్శలు గుప్పించడంతోపాటు బెదిరింపులకు దిగారు. వారికి ప్రతి సవాల్‌ చేస్తూ `ముంబయి వస్తోన్న దమ్ముంటే నన్ను ఆపండి` అని కంగనా వెల్లడించింది.

అన్నట్టుగా ఆమె బుధవారం ముంబయి వచ్చారు. కరోనా నిబంధనల్లో భాగంగా ఆమెని 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ముంబయికి చెందిన బ్రిహన్‌ ముంబై పున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు వెల్లడించారు. కానీ కంగనా దీనిపై స్పందిస్తూ, వారం రోజుల కంటే తక్కువ రోజుల్లోనే ముంబయి నుంచి వెళ్ళిపోతానని ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోగా, ఆమెకి షార్ట్ టర్మ్ విజిటర్‌ కేటగిరీ కింద క్వారంటైన్‌ వెసులుబాటుని కల్పించారు. దీని ప్రకాకం కంగన ఈ నెల 14న ముంబయి నుంచి తిరిగి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందంటున్నారు.

మరోవైపు ఆమె బుధవారం ముంబయి వచ్చే లోపే ఆమె నివాసం ఉండే బాంద్రా బంగ్లాలో అక్రమ నిర్మాణాలున్నాయంటూ బీఎంసీ అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగనా హై కోర్ట్ ని ఆశ్రయించి స్టే తీసుకొచ్చారు. దీంతో కూల్చివేతలను నిలిపివేశారు. దీనిపై కంగనా స్పందిస్తూ, యాజమాని లేకుండా ఎలా కూల్చివేతలకు పాల్పడతారు, నోటీసులకు స్పందించేందుకు కేవలం 24గంటలే ఎందుకు సమయం ఇచ్చారని ప్రశ్నించారు. కంగనా పిటిషన్‌ని నేడు కోర్ట్ విచారించనుంది.