బాలీవుడ్ బ్యూటీ కియారా తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ 'ఇందూ కీ జవానీ' అనే సినిమాలో నటిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ సినిమాలో కియారా డేటింగ్ యాప్స్ లో కనిపించే అబ్బాయిల ప్రోఫైల్స్ చూసి నచ్చినవారిని ఎంపిక చేసుకొని డేటింగ్ చేయాలనుకుంటుంది.

దీని వలన ఆమె ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే కాన్సెప్ట్ తో సినిమాను రూపొందించనున్నారు. ఈ విషయాన్ని కియారా ట్విట్టర్ వేదికగా ప్రకటించిన వెంటనే నటి కంగనా సోదరి రంగోలి ఆగ్రహం వ్యక్తం చేశారు.

''ఎవరైనా 'ఇందూ కీ జవానీ' అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తారా..? ఓ పక్క మహిళా సాధికారత గురించి మాట్లాడుతూనే మరోపక్క వారిని ఆట బొమ్మలుగా చూపిస్తున్నారు'' అంటూ మండిపడింది. ఒకవేళ సెన్సార్ బోర్డు ఈ సినిమాకు అంగీకరిస్తే అది ఆడవారికే అవమానకరమని అన్నారు. మన భావితరాలు తలదించుకునే రోజులు వస్తాయని, ఇలాంటి  సినిమాలు తీయడానికి బాలీవుడ్ కి సిగ్గు లేదా..?  అంటూ ఫైర్ అయింది. 

ఈ రకమైన సినిమాలు తీసే దర్శక, నిర్మాతలు తమ కుమార్తెల కళ్లల్లోకి చూడగలరా..? సిగ్గు చేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై కియారా ఇంకా స్పందించలేదు.