ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌కి షాక్‌ తగిలింది. తనకు నోటీసులు పంపించి షాక్‌ ఇచ్చారు. మొన్నటి వరకు మహారాష్ట్ర ప్రభుత్వంలో పోరాడిన కంగనాకి కొత్తగా ఈ నోటీసులేంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది సినిమాకి సంబందించిన నోటీసులు కావడం విశేషం. రెండేళ్ల క్రితం కంగనా `మణికర్ణిక` చిత్రంలో నటించి అదరగొట్టింది. ఇందులో ఝాన్సీ రాణి లక్ష్మీభాయిగా ఆమె అద్భుతమైన నటనని ప్రదర్శించింది. ఈ సినిమాతో తాను దర్శకురాలిగానూ మారిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సీక్వెల్‌ని తెరకెక్కిస్తానని ప్రకటించింది. `మణికర్ణిక రిటర్న్స్ః  ది లెజెండ్‌ ఆఫ్‌ దిద్దా` పేరుతో కాశ్మీర్‌రాణి జీవిత కథని రూపొందించబోతున్నట్టు ప్రకటించింది. 

అయితే కాశ్మీర్‌ రాణి జీవిత కథని `దిద్దాః కాశ్మీర్‌ కీ యోధా రాణి` పేరుతో ఆశిష్‌ కౌల్‌ అనే రచయిత పుస్తకం రాశారు. దిద్దా జీవిత చరిత్రకు సంబంధించిన హక్కులన్నీ తనకే సొంతమని ఆయన చెప్పారు. ఈ మేరకు కంగనాకి లీగల్‌ నోటీసులు పంపించారు. తన అనుమతి లేకుండా కంగనా రనౌత్‌ సినిమా తీస్తానని చెప్పడం వల్లే తను కంగనా రనౌత్‌కి లీగల్‌ నోటీసులు పంపించానని, మూడు రోజుల్లో ఆమె దీనిపై సమాధానం ఇవ్వాలని అశిష్‌ కౌల్‌ తరపున న్యాయవాది తెలిపారు. దీనిపై కంగనా రియాక్షన్‌ ఎంటనేది చూడాలి. 

ప్రస్తుతం కంగనా `తలైవి`,`తేజస్‌`, `దాఖడ్‌` చిత్రాల్లో నటిస్తుంది. వచ్చే ఏడాది `మణికర్ణిక రిటర్న్స్ః ది లెజెండ్‌ ఆఫ్‌ దిద్దా` చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. దీన్ని కమలేష్‌జైన్‌ నిర్మించనున్నారు. మరి దీనికి దర్శకత్వం ఎవరు వహిస్తారనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే కంగనా..జయలలిత పాత్రలో నటిస్తున్న చిత్రం `తలైవి`. జయలలిత బయోపిక్‌గా ఏ.ఎల్‌. విజయ్‌ దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో కీలక పాత్ర అయిన ఎంజీఆర్‌ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. నేడు(ఆదివారం) ఎంజీఆర్‌ 104వ జయంతి. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని అరవిందస్వామి, కంగనా కలిసి ఉన్న లుక్‌ని విడుదల చేశారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.