దర్శకుడు క్రిష్‌ దర్శకత్వం వహించిన 'మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ' సినిమా నేపథ్యంలో సినీ నటి కంగనా రనౌత్‌తో విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఓ దర్శకుడిగా తనకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేదని క్రిష్‌ మీడియా ద్వారా వెల్లడిస్తూ బాధపడ్డారు. ఈ వివాదంపై కంగన రనౌత్‌ సోదరి రంగోలి స్పందిస్తూ..క్రిష్‌కి కంగన చాలా సార్లు ఫోన్‌ చేసిందని కానీ అతను స్పందించలేదని అంటున్నారు. క్రిష్‌ సినిమా మొత్తాన్ని తానే తెరకెక్కించినట్లైతే అది నిజమని నిరూపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.  తాజాగా కంగన మాత్రం  ఈ విషయమై స్పందించారు. 

‘‘మణికర్ణిక’ సినిమాకు నేనే దర్శకత్వం వహించా’ అని క్లారిటీ ఇచ్చేసారు కంగనా రనౌత్‌.   ఈ వివాదంపై కంగన తొలిసారి స్పందించారు. స్విట్జర్లాండ్ ట్రిప్‌ నుంచి వచ్చిన ఆమె దీనిపై స్పందిస్తూ.. ‘‘మణికర్ణిక’కు నేనే దర్శకత్వం వహించా. ఆ విషయంలో ఎటువంటి మార్పులేదు. క్రిష్‌ ఇలా నన్ను ఎటాక్‌ చేయడం సరికాదు. ఒకవేళ ఆయన చెప్పేదే నిజమైతే నిరూపించుకోమని చెప్పండి. మీడియాతో మాట్లాడితే ఆయనకు ఎటువంటి లాభం లేదు. ‘మణికర్ణిక’ విడుదలైంది. ఆ సినిమాకు నేనే దర్శకత్వం వహించా. ఈ విషయంలో ఇక చేయడానికి ఏం లేదు’.

ఇక సినిమా 70 శాతం డైరెక్షన్‌ క్రెడిట్‌ను కంగన తీసుకోవడంపై క్రిష్‌ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా ఎడిటింగ్‌ సమయంలో ఆమె చాలా మూర్ఖంగా ప్రవర్తించినట్లు చెప్పారు. సినిమా అప్‌డేట్స్‌ తనకు చెప్పలేదని అన్నారు. దీనిపై చిత్ర నిర్మాత కమల్‌ జైన్‌ మాట్లాడుతూ.. క్రిష్‌ తమ సినిమాకు నష్టం కల్గించాలనే మీడియాకు అలా చెప్పారని ఆరోపించారు. సినిమాకు సంబంధించిన అన్ని నిర్ణయాల్ని ఆయనకు చెప్పే తీసుకున్నామని అన్నారు.

అలాగే ‘‘నా పాత్రను తీసేశారు, కట్‌ చేశారు’ అని ఆరోపణలు చేసిన వారికి నేను ఒక్కటి చెప్పాలి అనుకుంటున్నా. నేను ఓ నటిగా, ఫిల్మ్‌మేకర్‌గా మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్నా. వీటిని నేను నా స్వతహాగా సాధించా. మా నాన్న నాకివ్వలేదు. మీరూ ఇలాంటి స్థాయికి రండి. అంతేకానీ మరొకర్ని చూసి ఏడిస్తే.. ఫలితం లేదు’ అని చెప్పారు.