ఓ సినిమాకి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ ఓ రేంజ్ లో రావడం సాధారణమైన విషయమే.. కానీ టాక్ తో పని లేకుండా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంటాయి. గత శుక్రవారం నాడు నాని 'జెర్సీ'తో పాటు లారెన్స్ నటించిన 'కాంచన 3' సినిమా కూడా విడుదలైంది.

తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాకి బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో కొత్తదనం లేదని, రెగ్యులర్ హారర్ కామెడీల మాదిరి ఉందని తేల్చేశారు. సోషల్ మీడియాలో కూడా సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు వసూలు అవుతున్నాయి. 

మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసిన కావడంతో బీ,సీ సెంటర్స్ లో సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా తొలిరోజు రెండు భాషల్లో కలిపి రూ.20 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. తమిళనాడు వరకే రూ.10.6 కోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

మిగతా ఏరియాల్లో ఈ సినిమా రూ.2 కోట్లకు పైనే వసూళ్లు సాధించింది. మొత్తంగా ఇరవై కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాలు ఈ మధ్యకాలంలో పెద్దగా రాకపోవడంతో ఈ సినిమాకి నెగెటివ్ టాక్ ఉన్నా.. జనాలు ఎగబడుతున్నారు. మరి ఇదే జోరు వీక్ డేస్ లో కూడా చూపిస్తుందేమో చూడాలి!