కమల్ కేజ్రీవాల్ భేటీ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ తమిళనాడు రాజకీయాల్లోకి కమల్

గత కొన్ని రోజులుగా తమిళనాడులో రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు జరుగుతూ వస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె వారసత్వం కోసం పన్నీర్ సెల్వం వర్సెస్ శశికళ మద్య పెద్ద యుద్దమే జరిగింది. కాకపోతే అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్లు జైలు శిక్ష పడటంతో కథ మరో పలుపు తిరిగింది. ఆమెకు నమ్మిన బంటు అయిన పళని స్వామిని తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం దక్కేలా శశికళ చర్యలు తీసుకుంది.

దీంతో తమిళనాడులో రాజకీయంగా చక్రం తిప్పొచ్చు అనుకున్న శశికళకు పెద్ద షాక్ ఇస్తూ..సీఎం పళని స్వామి, పన్నీర్ సెల్వం ఒక్కటయ్యారు. అంతే కాదు అన్నాడీఎంకె పార్టీ నుంచి శశికళను బహిష్కరించారు. మరోవైపు తమిళనాడులో రాజకీయాల్లోకి కొత్త ముఖాలు పరిచయం అవుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

స్టార్ హీరోలు అయిన రజినీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని వీరితో పాటు విశాల్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విశ్వనటుడు కమల్ హాసన్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా చెన్నైలో సినీనటుడు కమలహాసన్‌ను ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కలిశారు. కేజ్రీవాల్‌, క‌మల్ ఢిల్లీలో 2005లోనూ క‌లుసుకున్నారు. షూటింగ్ ప‌నిమీద అక్క‌డ‌కు వెళ్లిన క‌మ‌ల్ ఆ స‌మ‌యంలో కేజ్రీవాల్‌ను క‌లిసి ప‌లు అంశాల‌పై చర్చించారు.

ఈ సమావేశం క‌మ‌ల‌హాస‌న్ ఇంట్లోనే జరిగినట్లు సమాచారం. అయితే వారిద్దరు ఏయే అంశాల‌పై చ‌ర్చిస్తున్నార‌న్న విష‌యం తెలియాల్సి ఉంది. మరోవైపు ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌ను కేజ్రీవాల్ స్వ‌యంగా క‌ల‌వ‌డంతో ఆయ‌న ఆప్‌లో చేర‌తారా? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ఇటీవ‌ల కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌ను క‌లిసిన క‌మ‌ల్.. తాను మ‌రికొంత మంది ముఖ్య‌మంత్రుల‌ను కూడా క‌లుస్తాన‌ని అప్ప‌ట్లో అన్నా రు.