యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారని తెలుస్తోంది. ఆయన నటిస్తోన్న కొత్త సినిమా షూటింగ్ కోసం కమల్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ 'ఇండియన్ 2' సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా కొత్త షెడ్యూల్ రాజామండ్రి సెంట్రల్ జైలులో నడుస్తోంది. కమల్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు సినిమాలో ఇంటర్వెల్ సీన్ లో వస్తాయని చెబుతున్నారు. ఇరవై రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. సినిమాకి సంబంధించిన రెండో షెడ్యూల్ ఇది. 

గతంలో సూపర్ హిట్ అయిన 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ముసలి గెటప్ లో ఉన్న సేనాపతి పాత్రలో కమల్ కనిపించబోతున్నారు. సినిమాలో రకుల్, కాజల్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. సినిమాలో ఓ కీలకపాత్రలో నటుడు సిద్ధార్థ్ కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు.

అనిరుద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాల్సింది. కానీ కొన్ని కారణాల వలన సినిమా ఆరంభ దశలోనే దిల్ రాజు తప్పుకున్నాడు. దీంతో లైకా ప్రొడక్షన్స్ ప్రాజెక్ట్ టేకప్ చేసింది.