లోకనాయకుడు కమల్ హాసన్ నవంబర్ 7న పుట్టినరోజు జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కమల్ హాసన్ అభిమానులు చూపించిన ప్రేమకు, ప్రముఖుల శుభాకాంక్షలకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. తన పొలిటికల్ పార్టీ మక్కల్ మీదిమయ్యం పార్టీ ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహించినందుకు సంతోషం వ్యక్తం చేశారు కమల్. 

మీ ప్రేమను మరింత పొందదానికి కృషి చేస్తాను అన్న కమల్ హాసన్ నా నెక్స్ట్ బర్త్ డే సెయింట్ జార్జ్ పోర్ట్ లో జరుపుకుందాం అని అన్నారు. రానున్న ఎన్నికలలో మక్కల్ మాదిమయ్యం పార్టీ తరపున గెలిచి సీఎం కావడం ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయంగా ఉన్న ఫోర్ట్ సెయింట్ జార్జ్ లో వేడుకలు జరుపుకుందాం అని పరోక్షంగా చెప్పారు. చివరి కామెంట్ పై నెటిజెన్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. 

ఆయన వీరాభిమానులు కమల్ నెక్స్ట్ సీఎం అని అంటుండగా కొందరు నెటిజెన్స్ కమల్ ది గొంతెమ్మ కోరిక, పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. కమల్ హాసన్ పార్టీ పెట్టి చాలా కాలం అవుతున్నా సంస్థాగతంగా అక్కడ బలపడలేదు. గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఈ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. 

ఎన్నికలకు కేవలం నెలల సమయం మాత్రమే ఉండగా కమల్ మాత్రం వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న భారతీయుడు 2 షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరిలో భారతీయుడు 2 విడుదల కానుందని సమాచారం. లేటెస్ట్ గా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో విక్రమ్ అనే మరో చిత్రం ప్రకటించారు.