లోకనాయకుడు కమల్‌ హాసన్‌ విలక్షణ నటుడే కాదు.. అపార జ్ఞానం ఆయన సొంతం. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న విషయాన్నైనా గుర్తుపెట్టుకోగలడు. అందుకు నిదర్శనమనే తాజాగా శ్రీ శ్రీ మాట.. ఆయన నోటి నుంచి రావడం. కమల్‌ తమిళంలో `బిగ్‌బాస్‌ 4`కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఎపిసోడ్‌లో ఓ గమ్మత్తైన సన్నివేశం చోటు చేసుకుంది. ఆయన తన కంటెస్టెంట్లకి శ్రీ శ్రీ వ్యాఖ్యలు తెలుగులో వినిపించడం విశేషం. 

`పతితులారా.. భ్రష్టులారా.. బాద సర్ప ద్రష్టులారా .. దగా పడిన తమ్ములారా ఏడవకండి ఏడవకండి.. జగన్నాథ రథ చక్రాలోస్తున్నాయి..వస్తున్నాయి. రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తా.. భూకంపం పుట్టిస్తాను` అని చదివి వినిపించారు. దీంతో సభ్యులంతా క్లాప్స్ కొట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఇలా దీపావళి స్పెషల్‌గా సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. తమిళంలో భారతీయార్‌ లాగా తెలుగులో శ్రీ శ్రీ అంత పెద్ద కవి అని, ఆయన గొప్పతనాన్ని వారికి వివరించారు. 

ఇదిలా ఉంటే కమల్‌ హాసన్‌ పెద్దగా చదువుకోలేకపోయినా, పుస్తకాలు బాగానే చదివారు. సమాజాన్ని అంతకంటే బాగా చదివారు. తెలుగులో శ్రీశ్రీ రచనలకు ఆయన పెద్ద అభిమాని. తాను నటించిన `ఆకలి రాజ్యం`లోనే శ్రీ శ్రీ ప్రస్తావన తీసుకొచ్చారు. సమాజంలోని అవినీతి, కుళ్లుని, కుతంత్రాలను ఆనాడే ప్రశ్నించారు. ఎత్తిచూపారు. చదువుకున్నవాడికి ఈ దేశంలో ఎలాంటి గది పడుతుందో స్పష్టంగా వివరించారు.