`ప్రాజెక్ట్ కే`లో తన పాత్ర ఏంటో తేల్చేసిన కమల్.. సినిమా ఒప్పుకోవడానికి కారణం కూడా వెల్లడి..
`ప్రాజెక్ట్ కే`కి కమల్ హాసన్ ఎంట్రీతో హైప్ పెరిగింది. అయితే `కల్కి`లో ఆయన పాత్ర ఏంటనేది సస్పెన్స్ గా మారింది. ఆ విషయాన్ని వెల్లడించారు లోకనాయకుడు, తన పాత్ర గురించి, తాను సినిమా చేయడానికి కారణం ఏంటో ఓపెన్‌గా చెప్పేశారు.

ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న మూవీ `ప్రాజెక్ట్ కే`. సుమారు ఆరువందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరక్కుతుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె వంటి సూపర్ స్టార్స్ ఇందులో నటిస్తుండటంతో ఈ సినిమాకి అంతర్జాతీయంగానూ క్రేజ్ ఏర్పడింది. అయితే సైన్స్ ఫిక్షన్‌గా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా భావించే కామిక్ కాన్ సాన్ డియాగో ఈవెంట్‌లో దీన్ని ప్రకటించారు. `కల్కి`గా దీన్ని టైటిల్ నిర్ణయించారు. `కల్కి 2898 ఏడీ` గా `ప్రాజెక్ట్ కే`కి నామకరణం చేశారు. భవిష్యత్ కాలంలో జరగబోయే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.
`కల్కి` ఫస్ట్ గ్లింమ్స్ ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెంచుతుంది. దీనిపై సెలబ్రిటీలంతా స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే కామిక్ కాన్ ఈవెంట్‌లో మన స్టార్స్ చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అయితే `ప్రాజెక్ట్ కే`లో కమల్ ముందు నుంచి లేరు. ఈ సినిమా ప్రారంభించి రెండేళ్లకుపైనే అవుతుంది. కానీ కమల్ గత నెలలోనే ఫైనల్ అయ్యారు. అయితే ఇన్నాళ్లు సస్పెన్స్ లో పెట్టారా? లేక రీసెంట్‌గానే తీసుకున్నారా? అనేది విషయాలు సస్పెన్స్. ఇదిలా ఉంటే కమల్ రాకతో `ప్రాజెక్ట్ కే` రేంజ్ పెరిగిపోయిందనేది వాస్తవం. ఇరవై ముప్పై ఏళ్ల క్రితమే పాన్ ఇండియా ట్రెండ్కి కారకులు కమల్, లోకనాయకుడిగా ఆయన ఫేమస్. ఆయనకి ఇతర కంట్రీస్‌లోనూ అభిమానులున్నారు, ఆయన సినిమాలు ఇతర భాషల్లోనూ ఆడాయి.
ఈ నేపథ్యంలో `ప్రాజెక్ట్ కే`లో కమల్ హాసన్ నటిస్తున్నారనే వార్త సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్‌కి, కమల్ తోడైతే అంచనాలకు, రేంజ్‌కి ఆకాశమే హద్దుగా మారుతుంది. ఇప్పుడు `కల్కి 2898ఏడీ` కూడా అలానే మారిపోయింది. అయితే ఈ సినిమాలో తాను నటించడానికి, ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణమేంటో తెలిపారు కమల్ హాసన్. అంతేకాదు, తన పాత్రని కూడా కన్ఫమ్ చేశారు. సినిమాలో కమల్ ది నెగటివ్ రోల్ అనే పుకారు ఉండింది. దాన్ని నిజం చేశారు కమల్.
`ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం.. నేను సారూప్య సినిమా నుంచి వచ్చాను. అలాంటి సినిమాలు చేస్తూ వచ్చాను. అందులో నెగటివ్, పాజిటివ్ అనేది ఉండదు. కాబట్టి సినిమాలో నెగటివ్ రోల్ చాలా ముఖ్యమైన పాత్ర` అని తెలిపారు. దీని కారణంగానే ఆయన ఈ సినిమా చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో తనది నెగటివ్ రోల్ అని చెప్పకనే చెప్పేశారు. మరోవైపు టీజర్‌లో కమల్ సర్ ఎక్కడ అని రానా.. దర్శకుడు నాగ్ అశ్విన్‌ని ప్రశ్నించారు. దానికి దర్శకుడు స్పందిస్తూ, కమల్ సర్ టీజర్ మొత్తంలో ఉన్నారు. కానీ ఆ విషయం మీకు తెలియదు` అని చెప్పడం విశేషం. టీజర్ బ్యాక్ డ్రాప్‌లో చూపించే విలన్ కమలే అనే విషయాన్ని నాగ్ సైతం చెప్పకనే చెప్పారు.
ఇక కామిక్ కాన్ వేదికపై ఇండియన్ స్టార్స్ ప్రభాస్, రానా, అమితాబ్ లను కమల్ హాసన్ అప్రిషియేట్ చేస్తున్నారు. వారిని అభినందిస్తూ మాట్లాడుతున్న సందర్భంలో జూమ్ వీడియో కాల్‌లో ఉన్న బిగ్ బీ స్పందిస్తూ.. `కమల్ చాలా నిరాడంబరంగా ఉండటం మానేయండి, మీరు మా అందరికంటే చాలా చాలా గొప్పనటుడు` అని తెలిపారు. అంతేకాదు కమల్ హాసన్ చాలా ఏళ్ల క్రితమే తనకు దక్కాల్సిన ప్రశంసలు అందుకున్నారు, అది కూడా అంతర్జాతీయ మీడియాముందు` అని బిగ్ బీ చెప్పడం విశేషం. ఇక `కల్కి 2898 ఏడీ` వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దిశా పటానీ ఇందులో మరో ముఖ్య పాత్ర పోషిస్తుంది.